
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్‌జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌లో అస్పష్టత కొనసాగుతోంది. అధికార ఎన్డీయేలోని ప్రధాన పక్షం బీజేపీ ఇప్పటికే 71 స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించగా ఇండియా కూటమి ఇంకా పోటీచేసే స్థానాలపైనే సిగపట్లు పడుతోంది. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో బుధ, గురువారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని మిత్రపక్షాలు తేల్చి చెబుతున్నాయి.
రాష్ట్రంలోని మొత్తం 243 సీట్లకు గానూ కాంగ్రెస్ గతేడాది పోటీ చేసిన సంఖ్యతో సమానంగా సీట్లను కోరుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీచేసి 19 చోట్ల నెగ్గింది. ఈసారి సైతం తమకే అంతే స్థానాలను కోరుతుండగా, ఆర్‌జేడీ మాత్రం 54–55 సీట్లకు మాత్రమే ఆఫర్ ఇస్తోంది. ఇదే అంశమై సోమవారం ఏఐసీసీ పెద్దలతో జరిగిన చర్చల సందర్భంగా మరో 3 స్థానాలు ఇచ్చేందుకు ఆర్‌జేడీ నేత తేజస్వీయాదవ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, తమకు కనీసంగా 65 స్థానాలైనా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్లు సమాచారం. దీనిపై బుధ, గురువారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
తేజస్వీ జోక్యంతో టికెట్లు ఇవ్వడం ఆపేసిన లాలు
ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సోమవారం రాత్రి పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇది సరైన విధానం కాదంటూ కుమారుడు తేజస్వీ యాదవ్ అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటికే టికెట్లు అందుకున్న నేతలు తిరిగి ఇవ్వాలని తేజస్వి కోరారు. ఇందుకు స్పందించింది కొందరే. గత వారమే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సునీల్ సింగ్ మంగళవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ల వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్ నేతల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా నడుస్తున్నాయి.