
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీ కూటముల మధ్య సీట్ల పంచాయతీ ఇంకా తేలలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వంలోని మహా ఘఠ్‌బందన్ కూటముల్లో సీట్ల పంపిణీపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని జన్ సురాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది.
జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) మొదటి జాబితాలో బీసీలు, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించారు. 16 శాతం మంది అభ్యర్థులు ముస్లింలు, 17 శాతం మంది అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారికి అవకాశం ఇచ్చారు. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించారు. రాజకీయాల్లో అవినీతి గురించి ప్రముఖంగా గళం విప్పిన పీకే.. అభ్యర్థుల ఎంపికలో క్లీన్ ఇమేజ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యావేత్తలు, మాజీ ప్రభుత్వ, పోలీసు అధికారులు రంగంలోకి దించారు.
అభ్యర్థుల్లో ప్రముఖ గణిత శాస్త్రవేత్తతో పాటు లాయర్, డాక్టర్ కూడా ఉన్నారు. కుమ్రార్ స్థానంలో పోటీకి దిగిన కెసి సిన్హా (KC Sinha).. పట్నా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆయన రచించిన పుస్తకాలు దశాబ్దాలుగా బిహార్, అనేక ఇతర రాష్ట్రాల పాఠశాలల్లోని విద్యార్థులు చదువుతున్నారు.
మాంఝీ అభ్యర్థి వైబి గిరి పట్నా హైకోర్టులో (Patna High Court) సీనియర్ న్యాయవాది. అనేక హై ప్రొఫైల్ కేసులను ఆయన వాదించారు. బిహార్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. పట్నా హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ కేసులకు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా కూడా వ్యవహరించారు.
చదవండి: బిహార్ సీఎం అభ్యర్థిగా అతడే బెస్ట్!
ముజఫర్‌పూర్ అభ్యర్థి డాక్టర్ అమిత్ కుమార్ దాస్.. పట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పూర్వ విద్యార్థి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను విస్తరించడానికి కృషి చేశారు. ఆయన భార్య కూడా డాక్టరే. ముజఫర్‌పూర్‌లో ఒక ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.
పీకే పోటీపై ఉత్కంఠ
జన్ సురాజ్ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాలో ఆ పార్టీ ప్రశాంత్ కిశోర్ పేరు లేకపోవడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఆర్జేడీకి బలమైన స్థానం అయిన రాఘోపూర్ నుంచి, తేజస్వి యాదవ్ స్థానం నుంచి లేదా ఆయన సొంత నియోజకవర్గం కర్గహర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు గతంలో పీకే వెల్లడించారు. కర్గహర్ అభ్యర్థిగా రితేష్ రంజన్ (పాండే)ను ఖరారు చేశారు. దీంతో రఘోపూర్ నుంచి పీకే పోటీ చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
जन सुराज के उम्मीदवारों की पहली सूची। pic.twitter.com/5VFYHHWm1W
— Jan Suraaj (@jansuraajonline) October 9, 2025