
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించి మూడు రోజులు అయ్యిందో లేదో.. ఇంతలోనే ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించిన కుమ్ములాటలు బయటపడుతున్నాయి. ఇటు ఎన్‌డీఏ, అటు మహా కూటమిలో సీట్ల భాగస్వామ్య ఒప్పందం ఇంకా కుదరనే లేదు. అన్ని పార్టీలు పరస్పరం గట్టి బేరసారాల్లో మునిగితేలుతున్నాయి.
ముఖ్యంగా బీహార్‌లో బలమైన నేతగా పేరొందిన చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్‌జేపీ(ఆర్), జితన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్‌ఏఎంలు సీట్ల కోసం బీజేపీతో గట్టి బేరసారాలు సాగిస్తున్నాయి. ఎన్‌డీటీవీ పేర్కొన్న కథనం ప్రకారం టిక్కెట్ల విషయంలో బీజేపీ తన మిత్రుడు చిరాగ్ పాశ్వాన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. చిరాగ్ తో రెండవ రౌండ్ చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న చిరాగ్‌ను తాజాగా బీహార్ ఎన్నికల ఇన్‌చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, వినోద్ తావ్డే మంగళ్ పాండేలు కలుసుకున్నారు. ఈ చర్చల ద్వారా రాజీమార్గం ఏర్పడవచ్చని భావిస్తున్నారు. బీజేపీకి అతిపెద్ద సవాలు చిరాగ్ పాశ్వాన్‌ను శాంతింపజేయడం. ఆయన బీజేపీ నుండి 30కి పైగా సీట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై బీజేపీతో చర్చలు కొనసాగుతున్నాయని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు.
ఇదేవిధంగా అసంతృప్త నేత జితన్ రామ్ మాంఝీని బుజ్జగించేందుకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగారు. మాంఝీకి పలు హామీలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ ప్రతి అసెంబ్లీ స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై, తుది పేర్లు ఖరారు చేయనున్నదని తెలుస్తోంది. మరోవైపు మహా కూటమిలోని విశాల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) చీఫ్ ముఖేష్ సాహ్ని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)తో సీట్ల కోసం చర్చలు జరుపుతున్నారని సమాచారం. అలాగే కాంగ్రెస్ కూడా సీట్ల కేటాయింపుపై ఆర్‌జేడీతో చర్చల్లో మునిగితేలుతోంది.
బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 2020 ఎన్నికలకు భిన్నంగా, పార్టీ గెలిచే సీట్లపై దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో పార్టీ ఆర్జేడీతో చర్చలు జరుపుతోంది. ఈసారి బీహార్‌లో కాంగ్రెస్ 55 సీట్లు గెలుచుకోవచ్చనే అంచనాలున్నాయి. పార్టీ 25 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిందని, సీట్ల పంపకం ఖరారు అయిన వెంటనే పేర్లను ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. జేడీయూ రాష్ట్రంలో 102 సీట్లలో పోటీ చేయవచ్చు. పార్టీ 30 సీట్లకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది. బీజేపీతో సీట్ల పంపకం ఒప్పందం ఖరారైన వెంటనే, పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నదని తెలుస్తోంది.