తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం | TTV Dhinakaran Rejoins NDA | Sakshi
Sakshi News home page

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం

Jan 21 2026 12:55 PM | Updated on Jan 21 2026 1:30 PM

TTV Dhinakaran Rejoins NDA

చెన్నై: తమిళనాడు ఎన్నికల వేళ  రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమ్మమక్కల్‌ మున్నేట్రకళగం (AMMK) అధినేత టీటీవీ దినకరన్‌ మళ్లీ ఎన్డీయేలో చేరారు. పళనిస్వామితో విభేదాలు కారణంగా గతంలో ఎన్డీయే నుంచి దినకరన్‌ వైదొలిగారు. బుధవారం ఆయన బీజేపీ తమిళనాడు ఇంఛార్జ్‌ పీయూష్‌గోయెల్‌ను కలిశారు. డీఎంకే ఓడించగల శక్తి ఎన్డీయేకి మాత్రమే ఉందని దినకరన్‌ అంటున్నారు. అమ్మమక్కల్‌ మున్నేట్రకళగం ఎన్డీయే కూటమిలో చేరికపై డీఎంకే నేతలు స్పందిస్తూ.. తమ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.

గతంలో కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన దినకరన్‌.. గత కొంతకాలంగా నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌ను పొగుడుతూ వచ్చారు. విజయ్‌ పార్టీతో పొత్తుకు వెళ్లవచ్చనే చర్చ జోరుగా సాగింది. టీవీకేతో చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. ఇంతలోనే విజయ్‌ పార్టీకి దినకరన్‌ షాక్‌ ఇచ్చినట్లయ్యింది.

కాగా, బీజేపీ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాల ఇన్‌చార్జ్, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఎన్డీయే కూటమి సీట్ల పంపకాల లెక్కను తేల్చేదిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఇవాళ (జనవరి 12 బుధవారం) ఆయా పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో బీజేపీ చేరిన విషయం తెలిసిందే. ఇక ఎన్‌డీఏ కూటమిని బలోపేతం చేయడానికి రాష్ట్రంలో బీజేపీ వర్గాలు తీవ్ర కుస్తీలు పడుతున్నాయి. బీజేపీరాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్, కో ఇన్‌చార్జ్‌లుగా ఉన్న కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇన్‌చార్జ్‌గా న్యాయశాఖ కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌ రాం మెహా్వల్, సివిల్‌ ఏవియేషన్‌ కేంద్ర సహాయ మంత్రి మురళీధర్‌ మోహుల్‌ ఇప్పటికే రంగంలోకి దిగారు. అన్నాడీఎంకేతో సంప్రదింపు ముగించారు.

ఇక కూటమిలోకి వచ్చే పార్టీలతో సంప్రదింపును విస్తృతం చేశారు. బీజేపీ, అన్నాడీఎంకే కూటమిలోకి ఇప్పటికే అన్బుమణి నేతృత్వంలోని పీఎంకే అధికారికంగా చేరింది. ఇక జీకే వాసన్‌ తమిళమానిల కాంగ్రెస్, ఏసీ షణ్ముగం పుదియ నిధి కట్చి, రవి పచ్చ ముత్త ఐజేకే వంటి పార్టీలతో చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ పార్టీల తాజాగా ఎన్‌డీఏలో ఉన్నప్పటికీ సీట్ల పందేరం విషయంగా చర్చలలో మునిగి ఉన్నాయి.

అదే సమయంలో అమ్మమక్కల్‌ మున్నేట్రకళగం (AMMK) టీటీవీ దినకరన్‌ను ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకునే దిశగా పీయూష్‌ గోయల్‌ ప్రయత్నాలు ఫలించాయి. టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని అమ్మమక్కల్‌ మున్నేట్రకళగం ఎన్డీయేలో చేరింది.

ఈనెల 23వ తేదీన మధురాంతకం వేదికగా జరిగే సభలో కూటమి పార్టీల నేతలందర్నీ ఒకే చోట చేర్చే విధంగా, ఎన్‌డీఏ కూటమి బలాన్ని ప్రకటించే విధంగా కసరత్తు వేగవంతం చేశారు. ఈ బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరు అవుతుండడంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. చెన్నై విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మదురాంతకంకు పీఎం వెళ్లనున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేక హెలిప్యాడ్‌ సిద్ధం చేశారు. మోదీ సమక్షంలో ఎన్‌డీఏ కూటమిని ప్రకటించేందుకు తగ్గట్టుగా పీయూష్‌ గోయల్‌ స్థానికంగా తిష్ట వేసి రచిస్తున్న వ్యూహాలన్నీ ఏ మేరకు ఫలితాల్ని ఇస్తాయో శుక్రవారం తేలనున్నది. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళని స్వామితో పోన్‌ ద్వారా ఎప్పటికప్పుడు పీయూష్‌ చర్చలు జరుపుతూ వస్తున్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement