పట్నా: బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో సందిడి నెలకొంది. పార్టీలలో చేరికలు కొనసాగుతున్నాయి. పోటీలో దిగేందుకు పలువురు నేతలు ఉబలాటపడుతున్నారు. ఈ నేపధ్యంలో రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్(పీకే)కు చెందిన జన్ సురాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. వీరిలో 16 శాతం ముస్లిం అభ్యర్థులు ఉన్నారు.
‘పీకే’ ప్రకటించిన తొలి జాబితాలో మాజీ అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వైద్యులు మొదలైనవారు ఉన్నారు. వచ్చే నెలలో బీహార్‌లో జరగబోయే రెండు దశల ఎన్నికల్లో పోటీచేయబోయే జన్ సురాజ్ అభ్యర్థుల మొదటి జాబితా ఇది. ఈ జాబితాలో 16 శాతం ముస్లిం అభ్యర్థులతో పాటు 17 శాతం మంది వెనుకబడిన వర్గాలకు చెందినవారున్నారు. ఎన్నికల వ్యూహకర్త నుండి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతిని ఎత్తిచూపారు. ఈ నేపధ్యంలోనే పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారి క్లీన్ ఇమేజ్ కీలక అంశంగా గుర్తించారు.
जन सुराज के उम्मीदवारों की पहली सूची। pic.twitter.com/5VFYHHWm1W
— Jan Suraaj (@jansuraajonline) October 9, 2025
ఇదిలావుండగా బీహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ప్రశాంత్ కిశోర్ ఇటీవల స్పష్టం చేశారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)తో జతకడతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తమ కూటమి ప్రజలతోనే ఉంటుందని అన్నారు. బీహార్‌ను దోచుకోవడానికే పోరాటం జరుగుతోందని, ఇది సీట్ల కోసం జరుగుతున్న యుద్ధం కాదని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై తీవ్ర చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్, చిరాగ్ పాశ్వాన్ మధ్య పొత్తు కుదరవచ్చనే ప్రచారం జరిగింది. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీకి 40 సీట్లు కేటాయించాలని కోరుతున్నారని సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ తాము గెలిచామని, ఈసారి కూడా తమకు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని పాశ్వాన్ డిమాండ్ చేస్తున్నారు.


