నితీశ్‌ సర్కార్‌కు పీకే బంపరాఫర్‌: జన్‌ సురాజ్‌ను ఆపేస్తా.. మద్దతు ఇస్తా!! కానీ..

Prashant Kishor Supports Nitish Govt If Provide Jobs Biharis - Sakshi

పాట్నా: జన్‌ సురాజ్‌ అభియాన్‌ ద్వారా బీహార్‌లో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తారని భావిస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఆసక్తికర ప్రకటన చేశారు. బీహార్‌ ప్రజలకు ఇచ్చిన ఒక హామీని నెరవేరిస్తే.. తన జన్‌ సురాజ్‌ అభియాన్‌ క్యాంపెయిన్‌ను ఆపేస్తానని, నితీశ్‌ సర్కార్‌కు మద్దతు ప్రకటిస్తానని పేర్కొన్నారాయన. 

సమస్తిపూర్‌లో బుధవారం తన మద్దతుదారులతో భేటీ అయిన ప్రశాంత్‌ కిషోర్‌.. మహాగట్‌బంధన్‌ కూటమిపై  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్‌ ప్రభుత్వంపై జనాల్లో అంతగా ఆదరణ లేదని వ్యాఖ్యానించారాయన. అంతేకాదు.. నితీశ్ కుమార్‌ సీఎం కుర్చీకి ఫెవికల్‌ అంటించుకుని కూర్చుంటే.. మిగతా పార్టీలు ఆయన చుట్టూరా తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. 

ప్రస్తుత డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌.. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీహార్‌ యువతకు పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే నితీశ్‌ కుమార్‌ కూడా మొన్న స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఉంటుందని ప్రకటించారు. ఈ ఇద్దరూ రాబోయే ఏడాది, రెండేళ్లలో తమ తమ హామీని నెరవేరిస్తే చాలూ.. నా జన్‌ సురాజ్‌ అభియాన్‌ను ఆపేస్తా. అంతేకాదు నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వానికి నా మద్దతు ప్రకటిస్తా అని మీడియా ముఖంగా తెలిపారు పీకే. 

ప్రత్యక్ష రాజకీయ పార్టీగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ.. ప్రాంతాల వారీగా సమస్యలు తెలుసుకోవడం, వాటికి పరిష్కారాలు చూపెట్టడం లాంటివి చేస్తుందని జన్‌ సురాజ్‌ అభియాన్‌పై గతంలోనే పీకే ఒక స్పష్టత ఇచ్చారు. అయితే నితీశ్‌ కుమార్‌కు మాత్రం జేఎస్‌ఏ గుబులు పుట్టిస్తూ వస్తోంది.

ఇదీ చదవండి: మూడొంతుల మందిపై క్రిమినల్‌ కేసులు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top