మూడొంతుల మందిపై క్రిమినల్‌ కేసులు!

72 percent of new ministers face criminal charges in Bihar cabinet - Sakshi

బిహార్‌ మంత్రులపై ఏడీఆర్‌ నివేదిక

న్యూఢిల్లీ: ఎన్‌డీఏ కూటమితో బంధం తెంచుకుని ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో జట్టుకట్టి బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని కొలువుతీర్చిన సీఎం నితీశ్‌కుమార్‌ క్రిమినల్‌ కేసులున్న నేతలతో దాదాపు మొత్తం మంత్రివర్గాన్ని నింపేశారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) తాజా నివేదిక ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిలో 70 శాతానికిపైగా నేతలపై క్రిమినల్‌ కేసులున్నట్లు ఏడీఆర్‌ నివేదించింది.

రెండేళ్ల క్రితం రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా అభ్యర్థులుగా వీరంతా సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్, బిహార్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థ సంయుక్తంగా క్షుణ్ణంగా పరిశీలించాక ఈ నివేదికను బహిర్గతంచేసింది. ఇందుకోసం సీఎం నితీశ్‌ సహా 33 మంది మంత్రుల్లో 32 మంది అఫిడవిట్లను పరిశీలించారు. మొత్తం మంత్రుల్లో 23 మంది(72 శాతం) తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, 17 మంది మంత్రులు(53 శాతం) తమపై తీవ్రమైన నేరమయ కేసులున్నాయి.

మొత్తం మంత్రుల్లో 27 మంది(84 శాతం) కోటీశ్వరులుకాగా, మొత్తం 32 మంది మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ.5.82 కోట్లు. పాతిక శాతం మంది మంత్రులు తమ విద్యార్హతలు 8వ తరగతి నుంచి ఇంటర్‌లోపేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌ ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు. జేడీ(యూ) నుంచి 11 మంది, ఆర్‌జేడీ నుంచి 16 మంది, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, జితన్‌ రాం మాంఝీ పార్టీ నుంచి ఒకరు, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యే మంత్రులుగా కొనసాగుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top