డిజిటల్ కాయిన్లుగా గోవులు
ఎన్‌ఎఫ్‌టీల ద్వారా ఇన్వెస్టర్లు కొనుక్కోవచ్చు
మెయింటెనెన్స్ బాదరబందీ లేదు
డివిడెండ్‌గా నెలకు రెండు లీటర్ల నెయ్యి
స్టార్టప్ ‘గోమిని’ వినూత్న వ్యాపారం
అంతా డిజిటల్‌మయంగా మారుతున్న నేపథ్యంలో పాడి వ్యాపారం కూడా డిజిటల్ బాట పడుతోంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే మనం ఆవుల్ని డిజిటల్‌గా కొనుక్కుని, మెయింటెనెన్స్ బాదరబందీ లేకుండా, రాబడిని అందుకునే విధంగా గోమిని అనే ఓ స్టార్టప్ సంస్థ వినూత్న వ్యాపారాన్ని తెరపైకి తెచ్చింది. బిహార్‌కి చెందిన ఈ స్టార్టప్‌ని అర్జున్ శర్మ అనే ఔత్సాహిక వ్యాపారవేత్త ప్రారంభించారు. మేలుజాతి దేశీ ఆవుల క్లస్టర్లను ఏర్పాటు చేశారు.
మోడర్న్ టెక్నాలజీతో ఒక్కో ఆవుకి ఎన్‌ఎఫ్‌టీ (నాన్–ఫంజిబుల్ టోకెన్)ని సృష్టించి, వాటిని విక్రయిస్తున్నారు. దీనితో అమెరికా, కెనడా, లండన్ ఎక్కుణ్నుంచైనా సరే ఇన్వెస్టర్లు ఎన్‌ఎఫ్‌టీలను కొనుక్కోవడం ద్వారా సదరు ఆవులను సొంతం చేసుకోవచ్చు. ఇలా అమ్మిన ఆవుల పోషణ భారాన్ని ఇన్వెస్టర్ల తరఫున ఇక్కడే గోమిని చూసుకుంటుంది. అంతేకాదు వారికి పెట్టుబడి మీద రాబడి కింద ప్రతి నెలా డివిడెండ్ మాదిరి రెండు కిలోల స్వచ్ఛమైన నెయ్యిని కూడా పంపిస్తుంది. అది కూడా వారు కొనుక్కున్న ఆవు ఇచ్చిన పాల నుంచి తీసినదే అయి ఉంటుంది.
రూ. 15 లక్షల వరకు రాబడి ..
ప్రయోజనాలు ఇక్కడితో ఆగిపోవు. సదరు ఆవు సంతతి పెరిగే కొద్దీ మరింత ఆదాయాన్ని కూడా ఇన్వెస్టరు పొందవచ్చు. పాలు, పిడకలు, అగరొత్తులు ఇత రత్రా ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 25% రాబడిని అందుకోవచ్చు. మొత్తం మీద కాస్తంత ఇన్వెస్ట్ చేస్తే ఓ ఆవును, దాని జీవితకాలంలో రూ. 15 లక్షలకు పైగా రాబడులు అందుకోవచ్చని శర్మ వివరించారు. సరే, దీనికి ఎన్‌ఎఫ్‌టీలాంటి సంక్లిష్టమైన టెక్నాలజీ హంగులు ఎందుకంటే, కొనుగోలు, ఆ తర్వాత జరిగే ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం అంటారు అర్జున్ శర్మ.
ఈ విధానంలో సిసలైన యజమానిని ధ్రువీకరించే డిజిటల్ సరి్టఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. ఇందులో ఆవు జాతి, వయస్సు, విశిష్ట గుర్తింపు, లొకేషన్, ఆరోగ్యం వివరాలు, రెవెన్యూ షేరింగ్ ఒప్పందం వివరాలు మొదలైనవన్నీ ఉంటాయి. ప్రస్తుతం బిహార్‌లో కంపెనీకి మూడు క్లస్టర్లు ఉన్నాయి. గో సేవను కేవలం చా రిటీకి పరిమితం చేయకుండా రాబడినిచ్చే లాభ సాటి పెట్టుబడి మార్గంగా మార్చడం వల్ల గో సంరక్షణ వైపు మరింత మంది ఇన్వెస్టర్లను మళ్లించవచ్చనేది అర్జున్ శర్మ ఆలోచన. తద్వారా అంతరించిపోతున్న మేలిమిజాతి దేశీ ఆవులను సంరక్షించవచ్చని ఆయన తెలిపారు. ఈ వినూత్న ప్రయత్నానికి నాబార్డ్ కూడా తోడ్పాటు అందిస్తోంది.
రైతుకు కూడా ప్రయోజనం ..
కేవలం ఇన్వెస్టర్ల కోణంలోనే కాకుండా రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉండే విధంగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు శర్మ తెలిపారు. ఫార్మ్‌లను నిర్వహించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి లభిస్తుందని వివరించారు. తద్వారా ఇటు గోమాతకి అటు మహిళల ఉపాధికి కూడా తోడ్పాటు అందించినట్లవుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం వివిధ రకాల ప్లాన్లు కూడా ప్రవేశపెట్టారు. రూ. 3,97,000 నుంచి కొనుగోలు చేయొచ్చు లేదా ముందుగా రూ. 30,000 బుకింగ్ కింద కట్టి ప్రతి నెలా ఈఎంఐ కింద ఓ 24 నెలలు రూ. 17,500 కట్టేలా కూడా ప్లాన్లను గోమిని అందిస్తోంది. కేవలం నెయ్యితో సరిపెట్టకుండా ఆవు పేడను కూడా మానిటైజ్ చేసే పనిలో ఉన్నారు అర్జున్ శర్మ. ఒక్క కేజీ పొడి ఆవు పేడతో అగరొత్తుల్లో ఉపయోగించే 1.4 కేజీ పొడిని తయారు చేయొచ్చని, దీనికి మరింత ఎక్కువ విలువ లభిస్తుందని ఆయన చెప్పారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్


