
లక్నో: ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు పొత్తులు కుదుర్చుకోవడంపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. 2027లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి పొత్తులు పెట్టుకోదని స్పష్టం చేశారు. లక్నోలో బీఎస్పీ సిద్ధాంతకర్త కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా జరిగిన ఒక సభలో పాల్గొన్న మాయావతి.. ఉత్తరప్రదేశ్‌లో లేదా దేశంలోని ఇతర ప్రాంతాలలోని పార్టీలతో పొత్తు కుదుర్చుకుని, ఎన్నికల్లో పోటీ చేయడం వలన పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూరదని వ్యాఖ్యానించారు.
‘మా పార్టీ ఓట్లు బదిలీ అవుతాయి. కానీ ఇతర పార్టీల ఓట్లు మాకు పడవు. ఇది మా ఓట్ల వాటాను తగ్గిస్తుంది. పొత్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, అవి ఎక్కువ కాలం ఉండవు’ అని మాయావతి పేర్కొన్నారు. గత ఎన్నికలను గుర్తుచేసుకుంటూ, తాము గతంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, తమ పార్టీ 67 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగిందన్నారు. అయితే 2007లో మేము ఒంటరిగా పోటీచేసి, మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగామన్నారు. సమాజ్‌వాదీ నేత ఆజం ఖాన్ బీఎస్పీలో చేరున్నారనే వార్తలను ప్రస్తావించిన మాయావతి గత నెలలో ఇతర పార్టీల నాయకులు బీఎస్పీలో చేరుతున్నారని, వారు తనను ఢిల్లీ, లక్నోలలో కలుసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాను ఎవరినీ కలవలేదని స్పష్టం చేశారు.
#WATCH | Lucknow, UP: On the death anniversary of party Founder Kanshi Ram, BSP chief Mayawati says, "...When we formed our government for the fourth time in UP, which was not liked by Congress, BJP, Samajwadi, and other casteist parties. Earlier, the BJP, which is in power at… pic.twitter.com/o1bcdozNWx
— ANI (@ANI) October 9, 2025
ఉత్తరప్రదేశ్‌లో తిరిగి తన బలాన్ని నిరూపించుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సిద్ధమయ్యారు. 2027లో జరిగే ఎన్నికలకు తన పునరాగమనాన్ని ఘనంగా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేసిన ఆమె, వచ్చే నెల 9న కాన్షీరాం వర్ధంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దళిత, ముస్లిం, బ్రాహ్మణ వర్గాల్లో తనకున్న పాత ఇమేజ్‌ను తిరిగి పొందడమే లక్ష్యంగా ఈ సభ ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి 1995, 1997, 2002, 2007లో నాలుగు మార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో 2007లో 403 సీట్లకు గాను 206 సీట్లు సాధించి ఆమె సొంతంగానే పూర్తిస్థాయి మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు.
రాష్ట్రంలో 22 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టిపట్టుంది. 2007లో సోషల్ ఇంజినీరింగ్ పద్ధతిని అమలు చేసి, బ్రాహ్మణులను దళితులతో కలపడం ద్వారా మాయావతి పూర్తి మెజారిటీతో దూసుకు పోయేందుకు సాయపడింది. అనంతరం 2012 ఎన్నికల్లో బీఎస్పీ ఓడినప్పటికీ ఆమె గెలుచుకున్న 80 సీట్లలో 14 మంది దళిత వర్గాల వారు గెలిచారు. 2017 ఎన్నికలకు వచ్చేసరికి ఎస్సీలు ఎక్కువగా బీజేపీకి మొగ్గు చూపినా బీఎస్పీ ఓట్ల శాతం మాత్రం పెద్దగా తగ్గలేదు. గడిచిన నాలుగు ఎన్నికల్లో బీఎస్పీ సగటున 25.42 శాతం ఓట్లను సాధించగా, ఇందులో మెజార్టీ ఓట్లు ఎస్సీ వర్గాల నుంచే ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఎస్‌పీ 13 శాతం ఓట్లు పడినా కేవలం ఒక్క సీటు మాత్రమే లభించింది. ఈ పరిణామాలన్నీ బీఎస్పీ ఉనికిలో లేవన్న సందేశాన్ని పంపడంతో చాలా మంది నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో 2027 ఎన్నికలకు ముందే పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు మాయావతి సకల ప్రయత్నాలు చేస్తున్నారు.