కైమూర్ జిల్లాలో తొలి ఎన్నికల ర్యాలీ
రెండో దశలో 100 చోట్ల బీఎస్పీ పోటీ
యూపీ సరిహద్దు జిల్లాలపై గురి
గెలుపోటములపై మాయా ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు తొలి దశ వరకు ఎక్కడా కనిపించని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి రెండో దశ ఎన్నికలకు శంఖారావం పూరించారు. తొలి దశ ఓటింగ్ జరిగిన గురువారం నుంచే ఆమె ఎన్నికల ప్రచారాన్ని కైమూర్ జిల్లా భబువా నుంచి ప్రారంభించారు. రెండో దశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్‌ను ఆనుకుని ఉన్నవే. దీంతో ఈ ప్రాంతాలపై ఆమె దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎవరి గెలుపును అడ్డుకుంటుందో..?
బిహార్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని అందరి కంటే ముందుగానే ప్రకటించిన బీఎస్పీ అందుకు తగ్గట్లుగానే అభ్యర్థులను కూడా ప్రకటించింది. కొన్ని చోట్ల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 190 చోట్ల ప్రస్తుతం బరిలో ఉంది. ఇందులో రెండో విడతలో ఎన్నికలు జరిగే 122 స్థానాలకు గానూ బీఎస్సీ వంద చోట్ల పోటీలో ఉంది. గత 20 ఏళ్లుగా బిహార్ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నా రెండంకెల స్థానాలను ఎన్నడూ గెలుచుకోలేదు.
2000 ఎన్నికల్లో 5 స్థానాలను, 2020 ఎన్నికల్లో ఒక్క స్థానంలో విజయం సాధించింది. గడిచిన ఎన్నికల్లో ఎంఐఎం, రాష్ట్రీయ్ లోక్ సమతా పార్టీలతో కలిసి పోటీ చేసిన బీఎస్పీ 1.49 శాతం ఓట్లనుు సాధించింది. బీఎస్పీ పోటీ చేసిన 78 స్థానాల్లో చాలా చోట్ల 4.5 శాతానికి పైగా ఓట్లు సాధించి ఆర్‌జేడీ, కాంగ్రెస్ కూటమి ఓట్లకు గండి కొట్టింది. బీఎస్పీ పోటీ చేసిన స్థానాలన్నీ ఎస్సీలు, ముస్లింలు అధికంగా ఉన్న స్థానాలే కావడంతో అక్కడ ఓట్ల చీలిక ఆ పార్టీల గెలుపు అవకాశాలకు దెబ్బకొట్టింది.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న బిహార్‌లోని సరన్, సివాన్, గోపాల్‌గంజ్, భోజ్‌పూర్, పశి్చమ చంపారన్, రోహ్‌తాస్, బక్సర్, కైమూర్ జిల్లాల్లోని నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. ఈ జిల్లాల్లో భోజ్‌పురి మాండలికం, జీవనశైలి, సాంస్కృతిక రీతులు చాలావరకు ఒకే విధంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని కుల, రాజకీయ పరిస్థితులు సారూప్యంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తన తొలి ఎన్నికల ర్యాలీని కైమూర్ నుంచి మొదలుపెట్టారు. ఈ జిల్లాలోని భబువా, మోహానియా, రామ్‌గఢ్, చైన్పూర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది.
గతంలో చైన్పూర్‌లో రెండుసార్లు బీఎస్పీ అభ్యర్థులు గెలిచారు. ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాల కంటే బీఎస్పీ బలంగా ఉండటంతో ఇక్కడే రాజకీయ ర్యాలీకి మాయావతి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా బీఎస్పీకి తొలినుంచి అండగా నిలిచిన ఎస్సీ వర్గాలతో పాటు మైనార్టీలను కలుపుకునేలా బీఎస్పీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో 15.5 శాతం ఎస్సీలు, 17.70శాతం ముస్లింలు కలిపి 32శాతం పైగా ఉండటంతో బీఎస్పీ వీరు అధికంగా ఉన్న సీట్లనే ఫోకస్ చేయనుంది. అదే జరిగితే ముస్లిం ఓట్లను నమ్ముకున్న కాంగ్రెస్, ఆర్‌జేడీల ఓట్లకు గండి పడటం ఖాయంగా కనిపిస్తోంది.


