ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందించింది. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడులు ఆకర్షణలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ పత్రిక ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రజానీకం, ఆర్థిక నిపుణులు కొందరు అంటున్నది ఏమిటంటే.. ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా కట్టబెడుతున్నందుకే ఈ అవార్డు అని! పైగా మీడియా సంస్థలు అధికారంలో ఉన్న వారికి అవార్డులు ఇస్తున్నాయంటే ప్రజలు సందేహించే పరిస్థితులున్నాయి. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే.. సీఎం లేదా ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్న నేతలకు ఇలా అవార్డులు ఇస్తూంటారన్న విమర్శ ఉండనే ఉంది. అంతేకాదు.. ఈ మీడియా సంస్థలు ప్రభుత్వాల నుంచి భారీ ఎత్తున ప్రకటనలు తీసుకుని ఆర్థిక ప్రయోజనం కూడా పొందుతూండటం గమనార్హం.
ఎకనమిక్ టైమ్స్ అలా ఇచ్చిందా? లేదా? అన్నదానికి జోలికి వెళ్లడం లేదు. కాని ఈ పత్రిక గ్రూపు నిర్వహించిన ఒక సదస్సుకు ఏపీ ప్రభుత్వం రూ.కోటిన్నరతో పాటు రూ.27 లక్షలు జీఎస్టీగా చెల్లించడం విమర్శలకు కారణమవుతోంది. ఈ అవార్డు ఎంపిక కమిటీలో చాలామంది ప్రముఖులే ఉన్నారు. ఆయా సందర్భాల్లో వీరు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన విషయం బహిరంగమే. ఓకే కానీ... ఏ కొలమానాల ప్రకారం చంద్రబాబును ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నది ప్రశ్న. ఎందుకంటే.. 18 నెలల అధికార అవధిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా వచ్చిన పరిశ్రమలేవీ లేవు. మంత్రి లోకేశ్ వంటి వారు.. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తోనే బోలెడన్ని పరిశ్రమలు వచ్చేస్తాయని గొప్పలు చెప్పుకున్నా వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగానే ఉంది. కూటమి సర్కారు విశాఖపట్నంతోపాటు మరికొన్ని చోట్ల కొన్ని కంపెనీలకు ఎకర భూమి రూ.99 పైసలకే లీజు లేదా గంపగుత్తగా ఇస్తున్నా అవే కంపెనీలు హైదరాబాద్‌లో వందల కోట్ల రూపాయలతో భూములు కొంటున్నాయి. రహేజా వంటి సంస్థలకు అంత తక్కువ ధరకు భూములిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం ఆశ్చర్యపోయింది.
సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ, వేల కోట్ల లాభాలు ఆర్జించే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు.. ఊరు పేరూ లేని ఉర్సా అనే కంపెనీలు ఈ చౌక బేరంతో లబ్ధి పొందాయి. చంద్రబాబు సన్నిహితుడిగా చెప్పే లూలూ మాల్ అధిపతి అహ్మదాబాద్‌లో రూ.519 కోట్లు పెట్టి భూమి కొనుక్కుంటే విశాఖ, విజయవాడలలో కాణీ ఖర్చు లేకుండా పలు రాయితీలతో భూమి పొందారు. విజయవాడలో వందల కోట్ల రూపాలయ విలువైన ఆర్టీసీ స్థలాన్ని కేటాయించేశారు. గూగుల్ డేటా సెంటర్ అని ప్రచారం చేసిన అదాని డేటా సెంటర్‌కు భూములు కేటాయించడమే కాకుండా ఏకంగా రూ.22 వేల కోట్ల విలువైన రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చేసింది. ఈ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు చూస్తే ఆ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? లేక చంద్రబాబు ప్రభుత్వమే ఆ సంస్థలలో ప్రజల సొమ్మును ఎదురు పెట్టుబడిగా పెడుతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ కంపెనీలకు ఇస్తున్న భూములు ఏకంగా 66 ఏళ్ల వరకు వారి అధీనంలోనే ఉంటాయి. అవి కల్పించే ఉద్యోగాల సంఖ్య ఎంత ఉంటుందో చెప్పలేం కాని, ఆ భూములవల్ల వారికి కలిగే ప్రయోజనం మాత్రం జాక్ పాట్ వంటిదే.
పరిశ్రమలకు భూమి, రాయితీలు ఇవ్వడం కొత్త కాదు.కాని ప్రభుత్వానికి బొత్తిగా ఆదాయం రాకుండా ప్రైవేటువారికే మేలు కలిగేలా ,వారికే సంపద సమకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ అవే వ్యాపార సంస్కరణలు ఈ మీడియా సంస్థలు డప్పు కొడితే ఏమి చేయగలం? ఇవే కాదు.. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చి వందల కోట్ల విలువైన భూములు కేటాయించి, నిర్మాణాలు చేపట్టి వేల కోట్ల సంపదను సృష్టిస్తే, వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటు వారికి సంపదగా మార్చేస్తున్నారు. అయితే ఇది కూడా వ్యాపార సంస్కరణ అనే ఆ అవార్డు కమిటీ భావించిందేమో.ఆంధ్రప్రదేశ్ ప్రాథమికంగా వ్యవసాయాధార రాష్ట్రం. కాని అక్కడ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఫలితంగా పలుమార్లు రైతులు తమ పంటలను పారబోస్తున్నారు. చాలా సందర్భాల్లో వ్యాపారులకు ఈ పంటలు కారుచౌకగా దొరుకుతున్నాయి.
రైతులేమో నష్టాల్లో కూరుకుపోతున్నారు. వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రైతుల సంక్షేమం కాంక్షించి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరు కార్చేయడంతో నష్టం మరింత ఎక్కువగా ఉంటోంది. యూరియా కొరతను అదనుగా చేసుకున్న వ్యాపారులు అందినంత దండుకున్నారు. ఆ రకంగా వారికి చంద్రబాబు అంటే మక్కువ ఏర్పడిందేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విద్య, వైద్య సామాజిక రంగాలలో జగన్ సంస్కరణలు తేగా, ఇప్పుడు కూటమి సర్కార్ ప్రజలను ప్రైవేటు సంస్థల దోపిడీకి వదలి వేసే విధానాలు తీసుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయకుండా మొత్తం ప్రైవేటు బీమా కంపెనీల చేతిలో పెట్టడానికి ప్రభుత్వం సిద్దం అవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, వలంటీర్లను ప్రవేశపెట్టి జగన్ పాలన సంస్కరణలు తెచ్చి ప్రజలకు పౌరసేవలను వారి ఇంటివద్దే అందిస్తే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇవన్ని ఏ రకంగా చూసినా పేదల వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూల విధానాలుగానే కనిపిస్తాయి. జగన్ టైమ్‌లో సెకీ ద్వారా తక్కువ ధరకు విద్యుత్ తీసుకోవాలని ఒప్పందం చేసుకుంటే అది అధిక ధర అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు అదానితో భేటీ అయిన వెంటనే దానికి ఓకే చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాక సోలార్ పవర్‌ను యూనిట్‌కు రూ.మూడు కంటే ఎక్కువ ధరకు కొనడానికి సిద్దపడుతున్నారు. ఇక రెడ్ బుక్ అరాచకాలతో పరిశ్రమలను కూడా వదలి పెట్టడం లేదు. ఒక మోసకారి నటిని అడ్డం పెట్టుకుని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై కూడా కేసు పెట్టే యత్నం జరిగింది. చిత్రంగా ఆయన కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారట.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి వాటా ఉన్న భారతి సిమెంట్‌తోసహా మరో రెండు సిమెంట్ కంపెనీల లీజును కక్షపూరితంగా రద్దు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇది ఏ రకంగా వ్యాపార సంస్కరణ అవుతుంది? ఏది ఏమైనా చంద్రబాబుకు ఎకనమిక్స్ టైమ్స్ అవార్డు ఇచ్చినందుకు ఏపీ ప్రజలు సంతోషిస్తారా? భయపడతారా? అన్నది చెప్పలేం. ఇలాంటి బిజినెస్ అవార్డుల ఉత్సాహంతో మరింతగా పెట్టుబడిదారులు, వ్యాపారులకు అణాకు, బేడాకు విలువైన రైతుల, ప్రభుత్వ భూములను కట్టబెట్టకుండా ఉంటే అదే పదివేలు అన్నది జనాభిప్రాయంగా ఉంది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


