సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇరిగేషన్ విషయంలో చేసిన ఆరోపణల నేపథ్యంలో.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సోమవారం మధ్యాహ్నాం మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడంతో పాటు ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అంశంపైనా వీళ్ల నుంచి సీఎం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని సమాచారం. అలాగే పెండింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ , పార్టీ పదవులపై భర్తీ పైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు..
అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ పైనా చర్చిస్తారని సమాచారం. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా అసెంబ్లీలో చర్చ చేపట్టే అంశంపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.
‘‘ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చింది. గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే.. రాష్ట్ర సర్కారులో చలనం లేదు. కృష్ణాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే చప్పుడు చేయట్లేదు. అందుకే నేనే రంగంలోకి దిగా. ఇవాళ్టి దాకా వేరు.. రేపట్నుంచి వేరు. మా కళ్ల ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే.. నేను ఎందుకు మౌనంగా ఉండాలి? ఇది సర్వభ్రష్ట సర్కారు. ఈ నిష్క్రియా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం’’ అని కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇరిగేషన్ విషయంలో దమ్ముంటే ఫేస్ టూ ఫేస్‌కు రావాలంటూ సీఎం రేవంత్ ఆ వెంటనే కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాలపై అవసరమైతే రెండేసి రోజుల చొప్పున శాసనసభలో చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలకు వస్తానని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అంగీకరిస్తే జనవరి 2 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో ఓ ప్రకటన చేశారు.


