
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో తిరిగి తన బలాన్ని నిరూపించుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సిద్ధమయ్యారు. 2027లో జరిగే ఎన్నికలకు తన పునరాగమనాన్ని ఘనంగా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేసిన ఆమె, వచ్చే నెల 9న కాన్షీరాం వర్ధంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దళిత, ముస్లిం, బ్రాహ్మణ వర్గాల్లో తనకున్న పాత ఇమేజ్‌ను తిరిగి పొందడమే లక్ష్యంగా ఈ సభ ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి.
పాత ఛరిష్మా కోసం పాట్లు...
బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి 1995, 1997, 2002, 2007లో నాలుగు మార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో 2007లో 403 సీట్లకు గాను 206 సీట్లు సాధించి ఆమె సొంతంగానే పూర్తిస్థాయి మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో 22 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టిపట్టుంది. 2007లో సోషల్ ఇంజినీరింగ్ పద్ధతిని అమలు చేసి, బ్రాహ్మణులను దళితులతో కలపడం ద్వారా మాయావతి పూర్తి మెజారిటీతో దూసుకు పోయేందుకు సాయపడింది. అనంతరం 2012 ఎన్నికల్లో బీఎస్పీ ఓడినప్పటికీ ఆమె గెలుచుకున్న 80 సీట్లలో 14 మంది దళిత వర్గాల వారు గెలిచారు.
2017 ఎన్నికలకు వచ్చేసరికి ఎస్సీలు ఎక్కువగా బీజేపీకి మొగ్గు చూపినా బీఎస్పీ ఓట్ల శాతం మాత్రం పెద్దగా తగ్గలేదు. గడిచిన నాలుగు ఎన్నికల్లో బీఎస్పీ సగటున 25.42 శాతం ఓట్లను సాధించగా, ఇందులో మెజార్టీ ఓట్లు ఎస్సీ వర్గాల నుంచే ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఎస్‌పీ 13 శాతం ఓట్లు పడినా కేవలం ఒక్క సీటు మాత్రమే లభించింది. ఈ పరిణామాలన్నీ బీఎస్పీ ఉనికిలో లేవన్న సందేశాన్ని పంపడంతో చాలా మంది నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో 2027 ఎన్నికలకు ముందే పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని, అక్టోబర్ 9న ఐదు లక్షల మందితో నిర్వహించే సభ ద్వారా తన బలాన్ని చూపించాలని మాయావతి పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి సన్నాహాలు క్షేత్ర స్థాయిలో జరుగుతున్నాయి. వార్డు స్థాయి సమావేశాలు జరిగాయి. మొత్తం కేడర్‌ను ఉత్తేజపరిచేలా నేతలు పర్యటనలు సాగుతున్నాయి.
అక్టోబర్ 8 నుంచే లక్నోలోని రమాబాయి మైదాన్‌కు సుదూర జిల్లాల నుంచి మద్దతుదారులు రావడం ప్రారంభిస్తారని, చాలా ఏళ్ల తర్వాత మాయావతి ఈ సభలో ప్రసంగించబోతున్నారని బీఎస్పీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంíపీ గిరీష్ చంద్ తెలిపారు. తమకు పట్టున్న ఎస్సీ వర్గాలతో పాటు ముస్లిం, బ్రాహ్మణ, ఓబీసీ వర్గాలను ఏకం చేసేలా ఈ సభ ఉంటుందన్నారు. పార్టీలోకి తిరిగి తీసుకొని జాతీయ సమన్వయకర్తగా నియమితులైన ఆకాష్ ఆనంద్ సైతం ఈ సభను హిట్ చేయడం ద్వారా పారీ్టకి కొత్త జవసత్వాలను అందించాలనే ప్రయత్నంలో ఉన్నారు.
ఆయన ఇప్పటికే యూపీ అంతా తిరుగుతూ బూత్ స్థాయి కమిటీల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే 95 శాతం కమిటీలు పూర్తి చేశారు. ఈ సభలోనే సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, నిషాద్ పార్టీతో సహా అనేక పార్టీల సీనియర్ నాయకులు బీఎస్పీలో చేరవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్పీ నేత ఆజం ఖాన్, బీజేపీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య రాజ్‌భర్ వర్గానికి చెందిన ఓం ప్రకాష్ రాజ్‌భర్, సంజయ్ నిషాద్, నసీముద్దీన్ సిద్ధిఖీ వంటి నాయకులు బీఎస్పీ శిబిరంలో చేరుతారనే చర్చ జరుగుతోంది.