న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ మూడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొలిక్కి వచ్చింది. వాటికి సంబంధించిన ఓటర్ జాబితా ముసాయిదాలు సిద్ధమయ్యాయి. అయితే ఆ ఐదు చోట్లా కలిపి ఏకంగా కోటి మందికి పైగా పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతవడం విశేషం. ముఖ్యంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ లోనే 58 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగింపునకు గురయ్యాయి! వారంతా ఓటర్ నమోదు ఫారాలు నింపి తిరిగివ్వని వారేనని ఈసీ అధికారులు చెప్పారు.
వారి పేర్లు ఆబ్సెంట్, షిఫ్టెడ్, మృతులు/డూప్లికేట్ ఓటర్లు (ఏఎస్డీ) జాబితాలో చోటుచేసుకున్నట్టు తెలిపారు. ‘ఆ పేర్లను మేం ఓటర్ల జాబితా నుంచి తొలగించలేదు. దానిపై ఆయా నియోజకవర్గాల ఎన్నికల నమోదు అధికారులే నిర్ణయం తీసుకుంటారు‘ అని వివరించారు. ‘నిజమైన ఓటర్ల పేర్లు తొలగింపుకు గురైతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తమ పేరు పునరుద్ధరించాలంటూ జనవరి 15 దాకా ఫారం 16 సమర్పించవచ్చు‘ అని తెలిపారు. పశ్చిమ బెంగాల్ మాదిరిగానే రాజస్తాన్ లో 44 లక్షలు, గోవాలో 1.01 లక్షలు, పుదుచ్చేరిలో 1.03 లక్షలు, లక్షదీ్వప్ లో 1,616 మంది పే ఓటర్ల జాబితా నుంచి ఏఎస్డీ జాబితాలోకి చేరాయి. బిహార్ లో కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిపిన ఎస్‌ఐఆర్ లో ఏకంగా 68 లక్షల ఓట్లు తొలగింపుకు గురవడం తెలిసిందే.
3 రాష్ట్రాలు, 2 యూటీల్లో కోటికి పైగా ∙అక్కడ ఎస్‌ఐఆర్ కొలిక్కి


