పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ టీ.ఆర్.బాలు తదితరులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టం
లోక్‌సభలో ‘వీబీ–జీ రామ్ జీ’ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం
తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యులు
లోక్‌సభ లోపల, బయట ఆందోళనలు
బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 20 ఏళ్లుగా అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో.. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ప్రతిఏటా 125 పనిదినాలకు హామీ ఇస్తూ మరో చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం లోక్‌సభలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్–గ్రామీణ(వీబీ–జీ రామ్ జీ) బిల్లు–2025ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి.
చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం పట్ల మండిపడ్డాయి. బిల్లును క్షుణ్నంగా పరిశీలించాలని, అందుకోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశాయి. చరిత్రాత్మకమైన ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి మోదీ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించాయి. విపక్షాల అభ్యంతరాలను శివరాజ్‌సింగ్ చౌహాన్ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం గాం«దీజీ ఆశయాలు, ఆదర్శాలను విశ్వసించడమే కాకుండా త్రికరణ శుద్ధిగా అమలు చేస్తోందని వివరించారు.
ఉపాధి హక్కుపై దెబ్బ: ప్రియాంక
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిరుపేదలకు ఏడాదికి 100 రోజులపాటు పని దొరుకుతోందని అన్నారు. మోదీ ప్రభుత్వం పేదల ఉపాధి హక్కును దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టం అమలుకు కేంద్రం 90 శాతం నిధులు ఇస్తోందని, ప్రస్తుతం దీన్ని 60 శాతానికి కుదిస్తున్నారని తప్పుపట్టారు. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. పథకం నుంచి గాం«దీజీ పేరు తొలగించడం అన్యాయమని అన్నారు.
జాతిపితను అపహాస్యం చేస్తున్నారు: బాలు
గాం«దీజీ గ్రామాల్లో నివసించారని, పేదల సంక్షేమం కోసం పనిచేశారని డీఎంకే సభ్యుడు టి.ఆర్.బాలు చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడానికి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని నీరుగార్చవద్దని కేంద్రాన్ని కోరారు. జాతిపితను మోదీ ప్రభు త్వం అపహాస్యం చేస్తోందని విమర్శించారు. వీబీ–జీ రామ్ జీ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. గాందీజీ ఫొటోలను ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం ఆందోళనకు దిగారు. గాంధీజీకి జరిగిన అవమానాన్ని దేశం సహించబోదంటూ నినదించారు.
రాముడి పేరును బద్నాం చేయొద్దు: థరూర్
వీబీ–జీ రామ్ జీ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యతిరేకించారు. 1971 నాటి బాలీవుడ్ పాటను ప్రస్తావించారు. ‘ఈ పని చేయొద్దు, రాముడి పేరును బద్నాం చేయొద్దు’ అని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. పేదలకు అండగా నిలస్తున్న పథకాన్ని బలహీనపర్చొద్దని తేల్చిచెప్పారు.
అనుమానాలు వద్దు: కేంద్రం
బిల్లుపై అనుమానాలు అవసరం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధన దిశగా గ్రామీణ పేదల ఉపాధికి హామీ ఇస్తూ చట్టం తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇది ఆధునిక చట్టబద్ధమైన ఏర్పాటు అని పేర్కొంది. పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం దీని ఉద్దేశమని వివరించింది.
విప్ జారీ చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ తమ లోక్‌సభ సభ్యులకు మంగళవారం విప్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులపాటు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఆదేశించింది. వీబీ–జీ రామ్ జీ సహా కీలకమైన బిల్లులపై చర్చ, ఓటింగ్ జరిగే అవకాశం ఉందని పేర్కొంది. బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని, ప్రజల గొంతుకను వినిపించాలని సూచించింది.
గాందీజీ ఆదర్శాలకు అవమానం
మహాత్మా గాంధీ ఆదర్శాలను ప్రభుత్వం అవ మానిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కేంద్రం తెచ్చిన బిల్లును తప్పుపడుతూ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బకొట్టాలన్నదే మోదీ ప్రభుత్వ అసలు ఉద్దేశమని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, యువత భవిష్యత్తు నాశనమవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.
నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలు
వీబీ–జీ రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఈ మేరకు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులకు లేఖ రాశారు. మహాత్మాగాంధీ చిత్రపటాలు చేతబూని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.


