పంచాయతీ ఎన్నికల వేళ... పచ్చని పల్లెలు భగ్గుమంటున్నాయి. ఓటు వేయలేదనే నెపంతో కొందరు... తమకు సహకరించలేదనే కారణంతో మరికొందరు దాడులకు పాల్పడుతున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడి
నర్సంపేట/దోమ/శంకరపట్నం: వరంగల్ జిల్లా చెన్నారా వుపేట మండలం చెరువుకొమ్ముతండాకు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సోమవారం అర్ధ రాత్రి తండాలోని దుర్గమ్మ గుడి వద్ద కాంగ్రెస్ బలపరిచిన ఎనిమిదో వార్డు అభ్యర్థి కొర్ర మోహన్, కార్యకర్తలు సుమన్, రమేశ్, బోడ రాందాస్, పవన్, అజయ్, బాలు, రమేశ్, రాజేంద్రప్రసాద్ తదితరులు చలిమంట కాగు తున్నారు.
ఈ సమయంలో బోడతండాకు చెందిన బీఆర్ ఎస్ కార్యకర్తలు బోడరెడ్డి, వెంకన్న, శ్రీను, ప్రసాద్, శ్రీనివా స్ అదే దారి గుండా వెళుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించారు. అంతేకాక తీవ్ర పదజాలంతో దూషిస్తూ చలిమంట కాగుతున్న వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు బీఆర్‌ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. తండావాసులు గమనించి గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.
సర్పంచ్ అభ్యర్థిపై కత్తితో దాడి
మూడోవిడత ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా రాకొండ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా అర్జున్ బరిలో ఉన్నాడు. సోమవారం సాయంత్రం దాటిన తర్వాత ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి, మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ సమయంలో మాస్క్ ధరించిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
దీంతో అర్జున్‌కు గాయాలవ్వగా, స్థానికులు వెంటనే అతడిని పరిగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీ స్నేహమెహ్ర ఆరా తీశారు. బాధితుడి తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఓటెయ్యలేదని బాలింతపై...
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌కు చెందిన ఖమురున్నిసా పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది. దీంతో కలత చెందిన ఆమె కుటుంబసభ్యులు యాస్మిన్, హకీంలు.. దాసరి పద్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. పద్మ కూతురు ప్రియాంక బాలింత అయినా, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయగా, తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో ఆస్పత్రికి తరలించారు.
అక్కడ సర్పంచ్ ఎన్నిక నామమాత్రమే..
దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లకావత్‌తండా(తూర్పు) సర్పంచ్ పదవికి లకావత్ భాగ్యనాయక్ పోటీ చేయగా, ప్రత్యర్థులు ఏకగ్రీవానికి అంగీకరించారు. అయితే స్వతంత్ర అభ్యర్థి లకావత్ శ్రీను తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. మరుసటి రోజు తాను పోటీలో నుంచి తప్పుకుంటానని ప్రకటించి ప్రచారం చేయలేదు. దీంతో అక్కడ సర్పంచ్ ఎన్నికకు పోటీ లేదని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ పరిధిలో 8 వార్డులుండగా, 3 ఏకగ్రీవమయ్యాయి.
సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం
రఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియాతండా సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గుగులోత్ చింతామణి భర్త రంగా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ గ్రామంలో మొదటి విడతలో ఎన్నికలు జరగ్గా..పంచాయతీ పరిధిలోని సుకినీతండా పోలింగ్‌బూత్‌లో దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తూ మూడు రోజుల క్రితం రాంబాబు సెల్‌టవర్ ఎక్కగా స్థానికులు, అధికారుల చొరవతో దిగొచ్చాడు. అయితే రంగా మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ సందర్భంగా చింతామణి మాట్లాడాడుతూ పలువురు దొంగ ఓట్లు వేశారని, చనిపోయిన వారి పేరిట ఉన్న ఓట్లు కూడా పోల్ అయ్యాయని ఆరోపించారు.
సార్లరావులపల్లి సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయండి
హైకోర్టును ఆశ్రయించిన పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులు
కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సార్లరావులపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ.. బరిలో నుంచి తప్పుకున్న అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సర్పంచ్ పదవికి ఇస్లావత్ శ్రీకాంత్, జర్పుల ప్రవీణ్, ఇస్లావత్ శ్రీను, నేనావత్ గణేశ్, బానావత్ బాలు నామినేషన్లు వేయగా, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఇస్లావత్ శ్రీను ఒక్కరే బరిలో ఉండగా, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. అయితే అధికార పార్టీకి చెందిన పలువురు తమను భయభ్రాంతులకు గురిచేసి, నామినేషన్లు విత్‌డ్రా చేయించారని ఆరోపిస్తూ ప్రవీణ్, గణేశ్, శ్రీకాంత్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.
ఇంట్లో కూర్చున్నా 208 ఓట్లు
తాండూరు రూరల్: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంద్రవంచ సర్పంచ్ స్థానానికి పటేల్ సుదర్శన్‌రెడ్డి, పటేల్ విజయ్‌కుమార్‌రెడ్డి నామినేషణ్లు దాఖలు చేశారు. విజయ్‌కుమార్‌రెడ్డిని విత్‌డ్రా చేయించి, సుదర్శన్‌రెడ్డిని ఏకగ్రీవం చేయాలని గ్రాబపెద్దలు నిర్ణయించారు. అప్పటికే వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అయితే విజయ్‌కుమార్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు.
దీంతో తాండూరులో ఉండే విజయ్‌కుమార్‌రెడ్డిని గ్రామస్తులు ఊర్లోకి రానీయలేదు. దీంతో ఆయన ప్రచారానికి దూరంగా తాండూరులోనే ఉండిపోయారు. 11వ తేదీన తొలివిడత పంచాయతీ ఎన్నిక లు జరగ్గా, విజయ్‌కుమార్‌రెడ్డికి 208, సుదర్శన్‌రెడ్డికి 469 ఓట్లు వచ్చాయి.
పైసలిస్తారా.. ప్రమాణం చేస్తారా..!
చింతలమానెపల్లి(సిర్పూర్): రెండోవిడత జరిగిన ఎన్నికల్లో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం బాలజీఅనుకోడ సర్పంచ్ పదవికి వగాడి శంకర్ పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. వగాడి శంకర్‌కు 338 ఓట్లు రాగా, విజేతగా నిలిచిన వ్యక్తికి 361 వచ్చాయి.
శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని మంగళవారం గ్రామంలోని ఓటర్లను డిమాండ్ చేశారు. పళ్లెంలో పసుపు కలిపిన బియ్యాన్ని వేసి తనకే ఓటేసినట్టు పసుపు బియ్యం పట్టాలంటూ ఓటర్ల వద్దకు వెళ్లారు. ఎన్నికల్లో రూ.8 లక్షలు పంచినా గెలువలేదని, తనను ఓటర్లు మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
అక్కడ 69 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు
తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీకి 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. మొట్టమొదటిసారి ఈ పంచాయతీకి 1956లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నుంచి ప్రతిసారీ గ్రామస్తులు సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈసారి సర్పంచ్ బరిలో ఇద్దరు ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. పంచాయతీ పరిధిలో 10 వార్డులుండగా, రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత గ్రామస్తులు బుధవారం పంచాయతీ ఓట్లను వినియోగించుకోనున్నారు.


