ప్రధానికి, కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయకు కిషన్‌రెడ్డి ధన్యవాదాలు
సాక్షి, న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, పెద్ద గోల్కొండ హ్యాబిటేషన్ లోని రాయికుంట గ్రామంలో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు.
11.12.2025న జరిగిన ఈఎస్‌ఐసీ 197వ సమావేశంలో రూ.16,125 కోట్ల విలువ చేసే భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 1.32 లక్షలకు పైగా ఉన్న ఈఎస్‌ఐ ఇన్‌స్రూెన్స్ కలిగిన కార్మికులున్నారని తెలిపారు.
శంషాబాద్ పరిధిలో పారిశ్రామికీకరణ వాణిజ్య సముదాయాలు వేగవంతంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వేల సంఖ్యలో కార్మికుల సంఖ్య పెరుగుతుందని, వారితో పాటు కార్మిక కుటుంబాలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయని వెల్లడించారు. శంషాబాద్ ఆస్పత్రి నిర్మాణం మొత్తం కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టంచేశారు.


