స్వల్ప ఉద్రిక్తతలు మినహా సాఫీగా సాగిన పంచాయతీ ఎన్నికలు
92.88 %తో టాప్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా
అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 84.28 శాతం ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ప్రకటించింది. మొదటి దశకు మొత్తం 53,57,277 మంది ఓటర్లు ఉండగా, వారిలో 45,15,141 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళా ఓటర్లు 84.40%, పురుష ఓటర్లు 84.16%, ఇతరులు 41.27 % ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% ఓటింగ్ నమోదయ్యింది.
మధ్యా హ్నం 1 గంటకు పోలింగ్ పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. కౌంటింగ్ పూర్తయ్యాక గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియ ముగిశాక ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు, చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ సాఫీగా సాగినట్టుగా ఎస్‌ఈసీకి నివేదికలు అందాయి.
ఉదయం నుంచే బారులు
ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం పోలింగ్ మొదలు పెట్టడానికి గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహించి గ్రీన్‌పేపర్‌తో బ్యాలెట్ బాక్స్‌లను సీల్ చేశారు. ఉదయం 9 గంటలకు 21.07%, 11 గంటలకు 53.04%, పోలింగ్ ముగిసే ఒంటిగంట సమయానికి 79.17% పోలింగ్ జరిగింది. అయితే అప్పటికే పోలింగ్ బూత్‌లలో క్యూలైన్లలో ఉన్నవారు కూడా ఓట్లు వేశారు. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసేసరికి 84.28% పోలింగ్ నమోదైనట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది.
కాగా ఓటింగ్ సరళిని ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి లైవ్ లో వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషనర్ ఐ.రాణీ కుముదిని పర్యవేక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.సృజన, ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరందు కూడా పోలింగ్ పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షణతో పాటు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందేలా ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేసింది.
అర్థరాత్రి దాటినా కౌంటింగ్
ఓటింగ్ శాతం భారీగా నమోదుతో పాటు క్యూలైన్లలో ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు సమయం పట్టడంతో.. మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు ఎక్కువ ఓట్లు ఉన్న చోట్ల కౌంటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొన్ని పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగింది.


