
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యుహాల్లో మునిగి తేలుతున్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్‌బంధన్ మధ్య ప్రధాన పోరు ఉంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ జన సురాజ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇక సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నట్టు సీ- ఓటర్ సర్వే (C-Voter survey) వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆశ్చర్యకరంగా మూడో స్థానానికి పరిమితం కాగా, ప్రశాంత్ కిశోర్ రెండో స్థానంలో నిలిచారు.
ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు సేకరించిన డేటా ఆధారంగా సర్వే ఫలితాలను సీ- ఓటర్ ప్రకటించింది. సెప్టెంబర్ ఫలితాలను తీసుకుంటే.. 35.5 శాతం మంది తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కోరుకున్నారు. ప్రశాంత్ కిశోర్ కావాలని 23.1 శాతం మంది ఆకాంక్షించారు. నితీశ్ కుమార్‌ను కేవలం 16 శాతం మంది మాత్రమే కోరుకున్నారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్‌కు 9.5, బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి (samrat choudhary) 6.8 శాతం మంది మద్దతు ప్రకటించారు.
అయితే ఫిబ్రవరి నుంచి చూసుకుంటే తేజస్వి, నితీశ్ కుమార్‌లకు మద్దతు తగ్గుతూ వస్తోంది. ఫిబ్రవరిలో తేజస్వికి 40.6 శాతం మంది, నితీశ్‌కు 18.4 శాతం మంది మద్దతు దక్కింది. మరోవైపు సీఎం అభ్యర్థిగా ప్రశాంత్ కిశోర్‌కు ఆదరణ పెరుగుతోంది. ఫిబ్రవరిలో ఆయనకు మద్దతు ఇచ్చిన వారు 14.9 శాతం మాత్రమే. 8 నెలల్లో ఆయనకు ఆదరణ 8.2 శాతం వరకు పెరిగినట్టు సీ ఓటర్ డేటా వెల్లడించింది. కాగా, మహాఘఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి తానేనని తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ఇప్పటికే ప్రకటించుకున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఎన్డీఏతో 'మహా' పోటీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, మహాఘఠ్‌బంధన్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సెప్టెంబర్‌లో నిర్వహించిన స్టేట్ వైబ్ సర్వే ప్రకారం.. మహాఘఠ్‌బంధన్ కూటమికి 34.9 శాతం, ఎన్డీఏ 34.8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగం, వలసలు గురించి బిహార్ ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని సర్వే వెల్లడించింది. ముస్లింలలో మూడింట ఒక వంతు (38.4%) ఓటు చోరీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేసిన ప్రచారం ఓటర్లపై కొంతమేర ప్రభావం చూపించినట్టుగా కనబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తల్లిపై ఏఐ- వీడియో వివాదాన్ని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. దాదాపు సగం మంది ఓటర్లు (49.8%) దీన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగానే పరిగణించారు.
తేజస్వీ యాత్రతో జోష్
తేజస్వీ చేపట్టిన యాత్రతో ఆర్జేడీ కార్యకర్తలను ఉత్తేజపరిచిందని 43.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. యాదవుల నుంచి మంచి స్పందన వస్తోందని 76.7 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) కుటుంబంలోని అంతర్గత వివాదాలు ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని 45.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. లాలూ కుటుంబ కలహాలు పార్టీపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాన్ని కలిగించబోవని యాదవుల్లో 70.6 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. అగ్రవర్ణ హిందువులలో 46.6% మంది ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
చదవండి: మహాఘఠ్‌బంధన్‌లో లుకలుకలు..!
ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నామని 56.3 శాతం మంది సర్వేలో చెప్పారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదని 43.7% మంది తెలిపారు. తమ ఓటు ఎవరికి వేయాలనే విషయంలో గ్రామీణ ఓటర్ల కంటే (51.8%) పట్టణ ఓటర్లు (66.9%) ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు సర్వే వెల్లడించింది.
నవంబర్‌లో ఎన్నికలు
ఈ ఏడాది నవంబర్‌లో బిహార్ శాసనసభ ఎన్నికలు (Bihar Assembly Election) జరగనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముందని భావిస్తున్నారు.