
బిహార్ సీఎం అభ్యర్థిగా ప్రకటించనందుకు కాంగ్రెస్‌పై తేజస్వి గుర్రు
ఆర్జేడీ 243 స్థానాల్లోనూ పోటీలో ఉంటుందని ప్రకటన
అవినీతి ఆరోపణలున్న లాలూ కుటుంబాన్ని దూరం పెడుతున్న కాంగ్రెస్
ఇతర కుల సమీకరణలు కూడా కారణమని విశ్లేషణలు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్‌బంధన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికే మహాఘఠ్‌బంధన్‌ను వేరుపడి ఒంటరి పోరు చేసేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ నిర్ణయించగా, అదే దారిలో ఆర్‌జేడీ సైతం పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొద్ది వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నా..ఇప్పటివరకు సీట్ల పంపకాలు ఖరారు కాకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ముఖం చాటేస్తుండటంతో కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చేసిన ప్రకటన ఘట్‌బంధన్ మైత్రిని ప్రశ్నార్థకం చేస్తోంది.
అవినీతి.. కులాల లెక్కలు
బిహార్‌లో 1980 వరకు కాంగ్రెస్ ప్రధాన రాజకీయ శక్తిగా ఉండేది. 1990లో లాలూప్రసాద్ యాదవ్, నితీశ్‌కుమార్ వంటి ప్రాంతీయ నేతల ఆవిర్భావంతో కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. చేసేది లేక వారి దయాదాక్షిణ్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆధారపడుతూ వస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మిత్రపక్షమైన ఆర్‌జేడీతో కలిసి ఈ ఎన్నికల్లో బిహార్‌లో తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంతో మొన్నటివరకు ముందుకెళ్లింది. గత ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాలకు గాను 75 స్థానాల్లో గెలిచింది.
వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీకి గరిష్ట స్థానాలు దక్కుతాయని, తానే సీఎం అభ్యర్థిని అవుతాననే ఉత్సాహంతో తేజస్వీ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఇటీవలే ఓట్ చోరీపై రెండు వారాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహాఘఠ్‌బంధన్ తరఫున తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా తప్పించుకున్నారు. తేజస్వి స్వయంగా తనను తాను బిహార్ సీఎంఅభ్యర్థిగా ప్రకటించుకుంటున్నా, కాంగ్రెస్ మాత్రం మిన్నకుండిపోయింది. ఇటీవలే కాంగ్రెస్ బిహార్ ఇన్‌చార్జి కృష్ణ అల్లవేరు మాట్లాడుతూ ప్రజలే సీఎంను నిర్ణయిస్తారని ప్రకటించడంతో గందరగోళం ఇంకాస్త పెరిగింది.
కాంగ్రెస్ అంచనా వేరే..
తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో కాంగ్రెస్‌కు బిహార్‌లో తమ పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉండాలన్నది పార్టీ దీర్ఘకాలిక వ్యూహంలా ఉంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 9 స్థానాలకు గానూ 3 స్థానాలను గెలుచుకోవడం, ఇటీవలి ఓటర్ అధికార్ యాత్రతో కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆదరణ పెరగడంతో కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే అదనుగా పార్టీని బలోపేతం చేసుకోవడం సులువని పార్టీ విశ్వసిస్తోంది.
ఈ సమయంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఆర్‌జేడీ బలపడి, కాంగ్రెస్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందనే భావన ఉంది. గత ఎన్నికల్లో కేవలం 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి 100కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని ప్రణాళికలు వేస్తోంది. తేజస్విని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తే సీట్ల బేరసారాల్లో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుంది. అదీగాక లాలూప్రసాద్ యాదవ్‌తో పాటు తేజస్వియాదవ్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వయంగా తేజస్విపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో వివాదాస్పద నేత నుంచి దూరంగా ఉండటం ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు ఆర్జేడీకి యాదవ్, ముస్లిం సామాజిక వర్గాల్లో గట్టి పట్టుంటే, కాంగ్రెస్‌కు అగ్రవర్ణాలతో పాటు ముస్లిం, దళిత ఓట్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా ఎన్డీఏ పక్షాల వైపు మొగ్గు చూపుతుంది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తేజస్విని పక్కనపెడుతుండటంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండ్రోజుల కిందట 243 స్థానాల్లో తాము పోటీలో ఉంటామనే ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనపై కాంగ్రెస్ స్పందించలేదు. ప్రస్తుత ఈ పరిణామాలు ఎటువైపు మళ్లుతాయన్నది ఆసక్తికరంగా మారింది.