పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదవసారి ప్రమాణ స్వీకారం చేసి, రికార్డు సృష్టించిన వేళ.. రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (పీకే) ఒక రోజుపాటు ‘మౌన వ్రతం’ పాటిస్తున్నారు. ఆయన ఈరోజు పశ్చిమ చంపారన్‌లోని భితిహర్వా గాంధీ ఆశ్రమంలో ఈ దీక్షను చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విఫలం కావడానికి తానే పూర్లి బాధ్యత వహిస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు.
ఆయన ఈ మౌనవ్రతానికి ముందు పట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘బీహార్ ప్రజలు దేని ఆధారంగా ఓటు వేయాలి? కొత్త వ్యవస్థను ఎందుకు సృష్టించాలి? అనే దాని గురించి వారికి వివరించడంలో విఫలమయ్యాను. ఈ వైఫల్యానికి ప్రాయశ్చిత్తంగానే మౌనవ్రతం చేస్తున్నాను. ఎన్నికల రాజకీయాలలో తమ తొలి అరంగేట్రం నిరాశపరిచినప్పటికీ, బిహార్‌ను మెరుగుపరచాలనే తన సంకల్పాన్ని నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని’ అన్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా, నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) 85 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ భారీ విజయంతో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం పట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది. 2005, 2010, 2015లో కూడా నితీష్ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు.
ఇది కూడా చదవండి: బిహార్ సీఎంగా నితీష్.. మంత్రులుగా 26 మంది ప్రమాణం


