
అదేదో సినిమాలో.. ఏమాత్రం రాజకీయానుభవం లేనివాళ్లను ఎన్నికల్లో నిలబెట్టి గెలిచి.. చివరకు తాను కాకుండా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని సీఎం చేస్తాడు క్లైమాక్స్‌లో హీరో. బీహార్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఈ సీన్‌ను ప్రస్తావిస్తున్నారు పలువురు. ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త(మాజీ).. తన పార్టీ జన్ సురాజ్ తరఫున అభ్యర్థుల ప్రకటనే ఇందుకు ప్రధాన కారణం.
ప్రశాంత్ కిషోర్(prashant kishor).. బీహార్ ఎన్నికల బరిలో తొలిసారి తన జన సురాజ్ పార్టీని ఒంటరిగా పోటీకి నిలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం 51 మందితో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేశారాయన. అందులో.. ప్రముఖ మ్యాథ్స్ ప్రొఫెసర్ కేసీ సిన్హా(పాట్నా వర్సిటీ మాజీ వీసీ), మాజీ అడ్వొకేట్ జనరల్ వైబీ గిరి, రితేష్ రంజన్ పాండే (బోజ్‌పురి గాయకుడు)తో పాటు డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, పోలీస్ అధికారులు సైతం ఉన్నారు. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే..
గోపాల్‌గంజ్ భోరే నియోజక వర్గంలో జన్ సురాజ్(Jan Suraaj Party) తరఫున పోటీ చేయబోతున్న ప్రీతి కిన్నర్(Preeti Kinnar).. ఈ జాబితాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎందుకంటే.. ఆమె ఓ ట్రాన్స్‌జెండర్ కాబట్టి. ప్రీతి కిన్నర్.. స్వస్థలం కల్యాణ్‌పూర్. ట్రాన్స్‌జెండర్ల నాయకురాలిగా.. సామాజిక వేత్తగా స్థానికంగా ఆమెకు మంచి పేరుంది. ఇంతకీ ఆమె పోటీ చేయబోతోంది ఎవరి మీదనో తెలుసా?.. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సునీల్ కుమార్ మీద. అందుకే ఆమె గురించి ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది. అయితే.. స్థానిక సమస్యలపై ఆమెకు అవగాహన ఉండడం కలిసొచ్చే అంశమని జన్ సురాజ్ భావిస్తోంది.
గెలిచిన దాఖలాల్లేవ్!
రాజకీయాల్లో ట్రాన్స్‌జెండర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు అత్యంత అరుదనే చెప్పాలి. 1998 మధ్యప్రదేశ్ ఎలక్షన్స్‌లో శబ్నం మౌసీ సోహగ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. 2015లో మధు కిన్నర్ చత్తీస్‌గఢ్ రాయ్‌ఘడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నెగ్గి.. మేయర్ పదవి చేపట్టారు కూడా. అయితే.. ఆ తర్వాతే ఆ వర్గం నుంచి చెప్పుకోదగ్గ విజయాలేవీ నమోదు కాలేదు.
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నుంచి రాజన్ సింగ్ పోటీ చేసి.. కేవలం 85 ఓట్లే దక్కించుకున్నారు. ఈ తరుణంలో ప్రీతి కిన్నర్.. అదీ జన్ సురాజ్ నుంచి బీహార్ ఎన్నికల బరిలో దిగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.

ప్రీతి కిన్నర్(ఎడమ), ప్రొఫెసర్ కేసీ సిన్హా(మధ్యలో), సింగర్ రితేష్ రంజన్ పాండే(చివర.. కుడి)
రిస్క్‌పై పీకే ఏమన్నారంటే..
జన్ సురాజ్ తొలి జాబితాలో.. సామాజిక న్యాయం వరకు అయితే బాగానే జరిగింది. 17 మంది ఈబీసీలు, 11 మంది బీసీలు, 9 మంది మైనారిటీలు, ఏడుగురు షెడ్యూల్ కాస్ట్(ప్రీతి కూడా), ఎనిమిది మంది ఇతర వర్గాల వాళ్లు ఉన్నారు. ‘‘జన సురాజ్ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో ఓట్లు పడకపోతే.. అది నా తప్పేం కాదు. అది ముమ్మాటికీ బీహార్ ఓటర్లదే’’ అని ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు. ‘పార్టీకి సరైన గుర్తింపు లేదు, ప్రచార నిధులు పరిమితంగా ఉన్నాయి. పైగా అవతల జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ లాంటి పార్టీలు ఉండగా.. ఎన్నికల్లో కొత్త ముఖాలతో వెళ్లడం రిస్క్ కాదా?’ అనే మీడియా ప్రశ్నకు ఆయన పైబదులు ఇచ్చారు. అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారం నినాదాలతో ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నారు.
అక్టోబర్ 11న, రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన పేరు తొలి జాబితాలో లేదు, కానీ రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందని పార్టీ తెలిపింది. నవంబర్ 6, 11.. రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections 2025) జరగనున్నాయి. నవంబర్ 14వ తేదీ ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఇదీ చదవండి: మాయావతి ఎంట్రీ.. సీన్ మారేనా?