
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమి(బీహార్‌లో మహాఘట్ బంధన్) మిత్రపక్ష పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. దీంతో ఈ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లైంది. ఈ క్రమంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌లపై జేఎంఎం సంచలన ఆరోపణలకు దిగింది.
ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా ఆరు సీట్లలో పోటీ చేస్తామంటూ శనివారం ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ.. తాము 12 సీట్లు కోరామని, స్పందన లేకపోవడంతోనే తాము సొంతంగా పోటీ చేస్తున్నామంటూ ప్రకటించారు. అలాగే.. బీహార్ ఎన్నికల తర్వాత పొత్తులపై సమీక్షిస్తామంటూ మరో బాంబ్ పేల్చారు.
ఈ నేపథ్యంలో.. ఆదివారం నామినేషనల గడువు ముగిసింది. అయినా కూడా ఆ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో.. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీ పోటీ నుంచి తప్పుకున్నట్లైంది.
ఇదిలా ఉంటే.. జేఎంఎం కీలక నేత, జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సంచలన ఆరోపణలకు దిగారు. సీటు పంచకంలో తమ పార్టీని పక్కన పెట్టారని.. వెన్నుపోటు రాజకీయం ప్రదరించారని అన్నారు. అభ్యర్థులను నిలబెట్టమని చెప్పకుండా, చివరి నిమిషం వరకు స్పష్టత ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. అంతేకాదు.. ఆర్జేడీ-కాంగ్రెస్‌లు ‘కూటమి ఒప్పందాన్ని’ సైతం గౌరవించలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీజేపీ సెటైర్లు
బీహార్ ఎన్నికల నుంచి జేఎంఎం తప్పుకోవడంపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘బీహార్ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసిపోయింది. కానీ JMM ఒక్క అభ్యర్థిని కూడా బరిలో నిలపలేకపోయింది. భారీ ప్రకటనలు చేసే ఆ పార్టీ.. ఈసారి ఏం చేసింది?. జార్ఖండ్ గడ్డ పరువు ప్రతిష్టలను దిగజారుస్తూ సిగ్గులేకుండా వ్యవహరించారని BJP ప్రతినిధి ప్రతుల్ షాహ్దేవ్ మండిపడ్డారు.
ఫస్ట్ టైం
ఇదిలా ఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జేఎంఎం దూరం కావడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. బీహార్-జార్ఖండ్ సరిహద్దు రాష్ట్రాల నియోజకవర్గాలైన జమై, చకాయి, ధమదాహా, మనిహారి, పిర్‌పైంటి, కటోరియా.. తదితర ప్రాంతాలలో ఆ పార్టీ క్రమం తప్పుకుండా పోటీ చేస్తుంటుంది. 2020 ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసినా ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది.
ఇదిలా ఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల (2025) నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్ (RJD), కాంగ్రెస్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు INDIA కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ.. సీటు పంపకాలపై ఏకాభిప్రాయానికి రావడం లేదు. ఈ గందరగోళం నడుమ.. ఆర్జేడీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించుకుంది. అలాగే.. కాంగ్రెస్ 61 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లలో వామపక్షాలకు, అలాగే.. వికాశీల్ ఇన్సాన్ పార్టీకి 15 సీట్లు పోనున్నట్లు తెలుస్తోంది.
అయితే సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటన.. స్పష్టత లేకపోవడంతో కాంగ్రెస్-ఆర్జేడీలు ఐదు నియోజకవర్గాల్లో ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. అలాగే.. కాంగ్రెస్ మరికొన్ని స్థానాలలో వామపక్షాల కూటమితోనూ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. బీహార్ ఎన్నికలు నవంబర్ 6, 11వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది. నామినేషన్ల గడువు ముగియడంతో.. ప్రచార కార్యక్రమాలు ఇవాళ్టి (అక్టోబర్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముజఫ్ఫర్‌పూర్ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: హోరాహోరీ పోరు! ఎలా ఉందంటే..