
నవంబర్ 6న తొలి దశ పోలింగ్
లాలు, నితీశ్‌లకే అసలు పరీక్ష
తొలి విడతలో 121 స్థానాలకు ఎన్నికలు..
అత్యధిక సీట్లలో ఆర్జేడీ, జేడీయూ పోటీ
బరిలో తేజస్వి, ఇద్దరు డిప్యూటీ సీఎంలు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. మొత్తం రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి అంకానికి తెరలేచింది. నవంబర్ 6వ తేదీన మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో 18 జిల్లాల పరిధిలోని 121 శాసనసభ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత పోరు ముఖ్యంగా అధికార, విపక్ష కూటముల్లోని ప్రధాన పార్టీలైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), లాలు ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రా్రïÙ్టయ జనతాదళ్ (ఆర్జేడీ)లకే అగ్నిపరీక్షగా మారింది. తొలి దశలోని అత్యధిక స్థానాల్లో ఈ రెండు పార్టీలే పోటీ పడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బరిలో ఎవరెవరు?
తొలి దశ ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరఫున, స్వతంత్రులు కలిపి మొత్తం 1698 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఎన్డీయే, మహాఘట్‌బంధన్ కూటముల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. మహాఘట్‌బంధన్ కూటమి నుంచి ఆర్జేడీ ఏకంగా 71 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 25, సీపీఐ (ఎంఎల్) 13 చోట్ల బరిలో ఉన్నాయి. ఎన్డీయే తరఫున జేడీయూ 57 సీట్లలో, బీజేపీ 48, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి
(రామ్ విలాస్) పార్టీ 14 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
ముఖాముఖి పోరు.. హోరాహోరీ!
ఈ 121 స్థానాల్లో అనేక చోట్ల నువ్వా–నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ముఖ్యంగా 36 కీలక స్థానాల్లో ఆర్జేడీ, జేడీయూ అభ్యర్థులు నేరుగా తలపడుతున్నారు. మరో 23 స్థానాల్లో ఆర్జేడీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుండగా, ఇంకో 23 సీట్లలో కాంగ్రెస్–బీజేపీ మధ్య ముఖాముఖి పోరు జరగనుంది.
దిగ్గజాల భవితవ్యం.. పరువు కోసం పోరు!
తొలి దశ ఎన్నికలు పలువురు రాజకీయ దిగ్గజాలు, ప్రముఖుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి (తారాపూర్), విజయ్ కుమార్ సిన్హా (లఖిసరాయ్) భవితవ్యం కూడా ఈ దశలోనే తేలనుంది. వీరితో పాటు భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్ (చప్రా నుంచి), జానపద గాయని మైథిలీ ఠాకూర్ (అలీనగర్ నుంచి) వంటి సెలబ్రిటీ అభ్యర్థులు కూడా బరిలో ఉండటం ఆసక్తిని రేపుతోంది. వీరే కాకుండా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు సైతం తొలి విడతలోనే తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో మొదటి దశ ఫలితాలు తదుపరి దశలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.