ఆదిలాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఇవి ముందుకెళ్లాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలి
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ముగిశాక అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండేళ్ల పాలన సాగించాం
బీఆర్‌ఎస్ హయాంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం చిక్కలేదు
ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.. రానివ్వబోమన్న ముఖ్యమంత్రి
ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు, వర్సిటీ బాధ్యత తమదేనని వెల్లడి
సాక్షి, ఆదిలాబాద్: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి నాలుగు కోట్ల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వీటిని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ముగిశాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేశ్ బీజేపీ అయినప్పటికీ వారిని కలుపుకొని అభివృద్ధి పథం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పు డు ప్రతిపక్ష నాయకులకు సీఎం సభలో పాల్గొనే, మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, సెక్రటేరియెట్‌లో వందలాది మంది పోలీసులను పెట్టి నన్ను, సీతక్కను నిర్బంధించారని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.. రానివ్వబోమని సీఎం అన్నారు. ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.
ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి
‘ఈ రెండేళ్లలో నేను ఏ ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రిగా చిన్న వయస్సులోనే నాకు అవకాశం వచ్చింది. దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు. ప్రస్తుతం ప్రజల కోసం, గౌరవం పొందడం కోసం నిరంతరం పనిచేస్తున్నా. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండేళ్ల పాలన సాగించా. తెలంగాణ ఆడబిడ్డలను గత ముఖ్యమంత్రి దివాలా తీయించాడు. మేము ఉచిత ప్రయాణం కల్పించాం.
వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు పెట్రోల్ బంక్‌లు నడుపుతున్నారు. మొత్తం కోటి మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంచుతాం. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే పాడిపంటలు సమృద్ధిగా పండుతాయి..అందుకే రాష్ట్రంలో వర్షాలు కూడా సమృద్ధిగా పడ్డాయి..’అని ముఖ్యమంత్రి అన్నారు.
రూ.లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయి..
‘ప్రాణహిత–చేవెళ్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో రూ.38 వేల కోట్లతో శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పెద్దాయన దయ్యంలా మారి ప్రాజెక్టును కాలగర్భంలో కలిపాడు. పేరు, ఊరు, అంచనాలు మార్చాడు. కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది. ఆయన ఇంట్లో కనక వర్షం కురిసిందే తప్ప ఆదిలాబాద్‌కు నీళ్లు రాలేదు.
తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్లకు అనుమతి ఇవ్వడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా.. గత ప్రభుత్వం తీరుతో ప్రాజెక్టు కిందికి తరలిపోయింది. రూ.లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయి. సొమ్ము రావడంతో సొంత కుటుంబసభ్యులు కత్తులతో పొడుచుకుంటున్నారు. బిడ్డ, కొడుకు, అల్లుడు తలో దిక్కు. అసలు ఆయన ఎక్కడ పడుకుంటున్నాడో అందరికీ తెలుసు..’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టు శంకుస్థాపనకు నేనే వస్తా..
‘మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు తమ పరపతితో ఆ ప్రభుత్వాన్ని ఒప్పించాలి. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు కట్టడానికి టెండర్లు పిలిచాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పొలాలకు నీళ్లు ఇస్తాం. ప్రాజెక్టు శంకుస్థాపనకు నేనే వస్తా. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి తెరిపించడానికి ప్రయత్నం చేస్తాం.
ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే. ఇక్కడ ఎయిర్‌పోర్టు కట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఏడాదిలో ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు తీసుకొస్తా. ఎయిర్ బస్సును కూడా తీసుకొస్తా. కొరటా–చనాఖా ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకోవాలని గతంలో కోరారు. ఇక్కడ నూటికి నూరు శాతం అభివృద్ధి పనులు చేపడతాం..’అని సీఎం చెప్పారు.
నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి..
‘తెలంగాణ యువకులు ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలన్నదే నా కోరిక. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 61 వేల ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు లేవు. కానీ వాళ్ల ఇంట్లో మాత్రం పదవులు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టొద్దు.. వీలైతే ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకోవాలి. గ్లోబల్ సమ్మిట్‌కు కన్నతల్లి లాంటి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకున్నాం. ఖర్గే, రాహుల్, ప్రియాంకలను ఆహా్వనించాం. ప్రధాని, కేంద్ర మంత్రులను కూడా రమ్మని కోరాం..’రేవంత్ తెలిపారు.
రూ.260 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలోనే రూ.260 కోట్లతో తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సీఎం లాంఛనంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’చొరవకు అభినందనలు
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీ ఏర్పాటు డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. వీటిపై ఇటీవల ఆదిలాబాద్‌లో ‘సాక్షి’ఆధ్వర్యంలో చర్చా వేదికలు నిర్వహించడం జరిగింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘సాక్షి’చొరవను పలువురు అభినందిస్తున్నారు.
సీఎంతో పాయల్ ముచ్చట
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ సభలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎంతో సుదీర్ఘంగా చర్చించడం సభకు హాజరైన ప్రజలందరి దృష్టినీ ఆకర్షించింది. సీఎం ప్రసంగించేంత వరకు వారిరువురు మాట్లాడుకుంటూ కన్పించడం చర్చనీయాంశమయ్యింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు ఆసీనులైన వేదికపై సీఎం పాయల్ శంకర్‌తోనే ఎక్కువసేపు మాట్లాడడంతో అంతగా ఏమి మాట్లాడి ఉంటారనే ఆసక్తి నెలకొంది.


