సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని.. తర్వాత అభివృద్ధే లక్ష్యం అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని కేంద్రంలోని నేతలను కూడా ఆహ్వానించానన్నారు. గురువారం.. ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో ఒక్కరోజైనా సెలవు తీసుకోలేదని.. విపక్ష నేతలను కలుపుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం సభల్లో విపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇచ్చారా? అంటూ రేవంత్ ప్రశ్నించారు.
‘‘ఎన్నికలయ్యాక ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యం. ఏడాదిలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తాం. ఎర్రబస్సు రావడం కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్ తీసుకొస్తున్నాం. అత్యంత వెనకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. ఆదిలాబాద్‌కు నీళ్ల కోసం ప్రాణిహిత- చేవెళ్ల ప్రాజెక్టు పనులను వైఎస్ ప్రారంభించారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా’’ అని రేవంత్ పేర్కొన్నారు.
‘‘జిల్లా అభివృద్ధికి రెండు నెలల్లో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. మళ్లీ తొందరలోనే ఆదిలాబాద్ వచ్చి సమీక్ష చేస్తాను. ఇంద్రవెల్లిలో యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం. బీఆర్‌ఎస్ హయాంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చారా?. మేం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు 61 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కాళేశ్వరం.. కూలేశ్వరం అయింది. ప్రజల సొమ్ము తిన్నవారు బాగుపడరు’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


