
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య లుకలుకలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపకంపై స్పష్టమైన ప్రకటనేదీ చేయకుండానే రాష్ట్రీయ జనతాదళ్(RJD), కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు.. తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేశాయి. దీంతో మహాఘట్ బంధన్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. పైగా కీలకమైన 11 స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులు తలపడబోతుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఈ పోటీని ఫ్రెండ్లీ ఫైట్‌గా అభివర్ణించుకున్నప్పటికీ.. బీజేపీ, జేడీయూ, ఇతర ఎన్డీయే మిత్రపక్షాలు మాత్రం విపక్ష కూటమిని ఎద్దేవా చేస్తున్నాయి. ఈలోపు.. ఊహించని పరిణామం ఒకటి అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే.. తన పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ ప్రచారం చేయాల్సి రావడం!.
గౌర బౌరమ్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థి అఫ్జల్ అలీ ఖాన్ పోటీ చేస్తున్నారు. అయితే తేజస్వి యాదవ్ అఫ్జల్ తరఫున కాకుండా వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(VIP Candidate) సంతోష్ సాహ్నికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు.
గౌర బౌరమ్ నియోజకవర్గంలో పోటీకి ఆర్జేడీ తరఫున అఫ్జల్ అలీ ఖాన్‌ను తొలుత అధిష్టానం ఎంచుకుంది. ఆ పార్టీ అధినేత లాలూ తన నివాసానికి పిలిచి మరీ అఫ్జల్‌కు పార్టీ గుర్తు (లాంతరు)తో క్లియరెన్స్ ఇస్తూ సీల్డ్ కవర్ అందజేశారు. ఆ సంతోషంలో.. ఆలస్యం చేయకుండా ప్రచారంలోకి దిగిపోయారు. ఆ వెంటనే నామినేషన్ దాఖలు చేశారు.
ఈలోపు.. లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ఎంట్రీతో సీన్ మారింది. సీట్ల పంపకంలో భాగంగా.. గౌర బౌరమ్‌ను వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి అప్పగించినట్లు లాలూకు వివరించారు. ఆపై నామినేషన్ వెనక్కి తీసుకోవాలని అఫ్జల్‌ను కోరారు. కానీ అందుకు ఆయన నిరాకరించాడు. ఈలోపు నామినేషన్ల గడువు ముగిసిపోయింది. దీంతో ఎన్నికల అధికారులను ఆర్జేడీ ఆశ్రయించింది.
అయితే రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్‌లో అభ్యంతరాలు లేవని చెబుతూ.. పోటీ నుంచి తొలగించలేమని చేతులెత్తేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఈవీఎం మీద ఆర్జేడీ లాంతర్ గుర్తుతో అఫ్జల్ అలీ అధికారికంగా పోటీ చేయబోతున్నారు. అలా మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకాల గ్యాప్ వల్ల తన పార్టీ గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థికి వ్యతిరేకంగా తేజస్వి ప్రచారం చేసే అరుదైన పరిస్థితి ఏర్పడింది(Gaura Bauram RJD Fight).
2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గౌర బౌరమ్ స్థానం వీఐపీ పార్టీకి చెందిన స్వర్ణ సింగ్‌కు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నెగ్గిన ఆమె తర్వాత బీజేపీలో చేరారు. అంతకు ముందు.. 2015, 2010 ఎన్నికల్లో జేడీయూ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది.
కొసమెరుపు.. పైన చెప్పుకున్న సందర్భం మొదటిసారేం కాదు. కిందటి ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ రాజస్థాన్ బన్స్‌వారా నియోజకవర్గంలో ఇదే తరహ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అరవింద్ దామోత్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆపై మనసు మార్చుకున్న హైకమాండ్ భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ రౌత్‌కు సీటు కేటాయిస్తూ.. తన అభ్యర్థిని సింబల్ రిటర్న్ చేయమని కోరింది. అయితే పార్టీకి మస్కా కొట్టి నామినేషన్ ఉపసంహరణ గడువు దాకా దామోత్ అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో.. కాంగ్రెస్‌కు తన అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఆ ఎన్నికల్లో రౌత్ విజయం సాధించినప్పటికీ.. దామోత్‌కు 60 వేల ఓట్లు పోలయ్యాయి.