
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్ దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పడం.. రాజకీయంగా దుమారాన్ని రేపింది. నమ్మకం ఉన్నవారికే.. అంటూ చేసిన కామెంట్‌పై బీజేపీ భగ్గుమంది. ఇది హిందువులపై వివక్షేనంటూ తీవ్రస్థాయిలో ఆ పార్టీ నేతలు విరుచుకుపడతున్నారు.
తాజాగా ఉదయ్‌నిధి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘వేదికపైకి వచ్చినప్పుడు కొందరు నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. అయితే దీపావళి శుభాకాంక్షలు చెప్పడం కోసం కొందరు సంకోచించారు. ‘చెబితే వీడు ఎక్కడ కోపపడతాడేమో?’ అని అనుకుని ఉండొచ్చు. అందుకే నమ్మకం ఉన్నవారికి మాత్రమే శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలపై(Udhayanidhi Stalin Diwali wish) బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ‘‘వాళ్లు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా హిందువులే. అందుకే మేం అందరికీ శుభాకాంక్షలు చెబుతాం" అంటూ ఉదయ్‌నిధి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇతర మతాల విషయంలో ఇలా ఎందుకు చేయబోరని.. ఆయన వ్యాఖ్యలు హిందువులపై వివక్ష చూపుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన నమ్మకం ‘‘ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు" అనే వ్యాఖ్యపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా తీవ్రంగా స్పందిస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ANS ప్రసాద్ స్పందిస్తూ.. హిందూ పండుగలపై డీఎంకే ప్రభుత్వం కనీస గౌరవం ప్రదర్శించబోదని మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడిని సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. అయినప్పటికీ ఎందుకనో డీఎంకే ప్రభుత్వం హిందూ మతంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తోంది. ఆ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’’ అని ప్రసాద్ విమర్శించారు. ఇదిలా ఉంటే..
డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ్‌నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం అనేది సామాజిక అసమానతలకు మూలం అంటూనే.. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించకూడదు, నిర్మూలించాలి. ఇది డెంగీ, మలేరియా లాంటి వ్యాధిలా ఉంది అంటూ విమర్శించారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడగా.. దేశవ్యాప్తంగా కేసులు కూడా నమోదు కావడంతో కోర్టుల్లో విచారణ జరుగుతోంది.
ఇదీ చదవండి: తమిళనాడు ఎలక్షన్స్.. వార్నీ.. అప్పుడే తొలి జాబితా రిలీజ్