
ఆరుగురితో సీమాన్ జాబితా
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే తన పార్టీ అభ్యర్థులు ఆరుగురి జాబితాను నామ్ తమిళర్ కట్చినేత సీమాన్ ప్రకటించారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే కూటములు ఎన్నికల కార్యక్రమాలను వేగవంతంచేసినవిషయం తెలిసిందే. ఇక టీవీకే నేతవిజయ్ సైతం తన నేతృత్వంలో కూటమి ప్రయత్నాలలో ఉన్నారు. అదే సమయంలో తాను ఎల్లప్పుడూ ఒంటరే అని చాటుకుంటూ ఓటు బ్యాంక్‌ను ప్రతి ఎన్నికలలో పెంచుకుంటూకేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపును సైతం దక్కించుకున్న నామ్‌తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ అందరి కంటే ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. సేలంలో ఆదివారం జరిగిన సభలో ఆయన ఆరుగురు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులో చందనపు స్మగ్లర్ వీరప్పన్‌కుమార్తె విద్యారాణి కూడా ఉన్నారు. ఆమె సేలం జిల్లా మేట్టూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని సీమాన్ ప్రకటించారు. అలాగే శంఖగిరి నుంచి నిత్య అరుల్, వీర పాండి నియోజకవర్గం నుంచి రాజేష్‌కుమార్, సేలం పశ్చిమ నియజకవర్గం నుంచి సురేష్‌కుమార్, గెంగవళ్లి నుంచి అభిరామి,ఆత్తూరు నుంచి మోనిషా చిన్న స్వామి పోటీ చేస్తారని సీమాన్ ప్రకటించారు.