తమిళసినిమా: చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు విజయ్ సేతుపతి. తమిళం, తెలుగు హిందీ భాషల్లో ఎడా పెడా చిత్రాలు చేస్తున్న ఈయన నటించిన తమిళ చిత్రం ట్రైన్, తెలుగులో పూర్తి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తున్న అరసన్ చిత్రంలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు.అదే విధంగా మరి కొన్ని చిత్రాల్లో నటిస్తున్న విజయ్ సేతుపతి తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈయన ఇంతకుముందు అజిత్,త్రిష జంటగా నటించిన విడాముయర్చి చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం.ఆ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీంతో చిన్న గ్యాప్ తీసుకుని కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ప్రతి నాయకుడిగా నటించనున్నట్లు. తెలిసింది. ఇకపోతే ఇందులో విజయ్ సేతుపతికి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో నటించడానికి ఆమె అంగీకరిస్తే కోలీవుడ్లో మరో క్రేజీ కాంబో షూరూ అవుతుంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరి కొద్ది రోజుల్లో ఆగాల్సిందే.


