తమిళసినిమా: చాలా కాలంగా వార్తల్లో ఉన్న చిత్రం వాడివాసల్. కారణం ఇది నటుడు సూర్య హీరోగా నటించనున్న చిత్రం కావడం, దీనికి వెట్రిమారన్ కథ, దర్శకత్వం వహించనుండటమే కాకుండా కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం కావడమే. అదేవిధంగా ఇది జల్లి కట్టు క్రీడ నేపథ్యంలో సాగే కథ చిత్రం కావడం. ఈ చిత్రం గురించి ప్రకటించి చాలా కాలం అయ్యింది. ఇందుకోసం సూర్య చాలా నెలల క్రితమే నిజం జల్లికట్టు వీరులు వద్ద శిక్షణ కూడా పొందారు. చాలాకాలం క్రితం ప్రారంభం కావాలసిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ సెట్ పైకి వెళ్లలేదు. దర్శకుడు వెట్రిమారన్ విడుదలై 1,2 చిత్రాలను పూర్తి చేసి ప్రస్తుతం శింబు హీరోగా అరసన్ చిత్రాన్ని చేస్తున్నారు. అదే విధంగా నటుడు సూర్య కూడా రెట్రో చిత్రాన్ని పూర్తి చేసి కరుప్పు చిత్రాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి మళయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇంక మరిన్ని చిత్రాలను కమిట్ అయ్యారు. దీంతో వాడివాసల్ చిత్రం ఎప్పుడు సెట్ పైకి వెళుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.ఇలాంటి పరిస్థితుల్లో వాడివాసల్ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని నిర్మాత కలైపులి ఎస్. థాను ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా నటుడు సూర్య తన బిజీ షెడ్యూల్‌లో వాడివాసల్ చిత్రం కోసం నెలకు 10 రోజులు కాల్‌షీట్స్ కేటాయించడానికి సమ్మతించినట్లు తాజాగ సమాచారం. దీంతో వాడివాసల్ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వెట్రిమారన్ అరసన్ చిత్రాన్ని పూర్తి చేసి ఈ చిత్రంపై పూర్తిగా దృష్టి సారించ నున్నట్లు సమాచారం.


