
బిహార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అమిత్ షా
పట్నా: బిహార్‌లో ‘జంగిల్‌రాజ్’కొత్త ముసుగు ధరించి మళ్లీ వచ్చిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. విపక్ష ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. ఆర్జేడీ పాలనలో అరాచక శక్తులు చెలరేగిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు అవే శక్తులు మరో రూపంలో వస్తున్నాయని దుయ్యబట్టారు. అప్పటి రాక్షస పాలన మళ్లీ రావడాన్ని ప్రజలు అంగీకరించబోరని తేల్చిచెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మరోసారి విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ‘ఇండియా’కూటమిని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. శనివారం బిహార్ రాజధాని పట్నాలో ఓ వార్తా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘బిహార్ సమాగం’లో అమిత్ షా మాట్లాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగాలంటే ఎన్డీయేను గెలిపించాలని చెప్పారు.
బెంగాల్‌లో చొరబాటుదారులకు రెడ్ కార్పెట్
బీజేపీ పాలిత అస్సాంలో అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లు అమిత్ షా తెలిపారు. అస్సాం పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లోకి చొరబాట్లు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ వలసదారులకు బెంగాల్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోందని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగించడానికే ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ ప్రారంభించినట్లు స్పష్టంచేశారు. ఎస్‌ఐఆర్ పేరిట ఓట్ల చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు.
జమ్మూకశ్మీర్‌కు సరైన సమయలో రాష్ట్ర హోదా
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే లద్దాఖ్ ప్రజల డిమాండ్లకు తగిన పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. ఆరి్టకల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగం పుంజుకుందని తెలిపారు. అక్కడ ప్రజాస్వామ్యం బలోపేతం అయ్యిందని స్పష్టంచేశారు.