
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో కనీసం కోటి బోగస్ ఓట్లున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ ఓట్లను ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తూ నవంబర్ ఒకటో తేదీన ముంబైలో ఉమ్మడిగా ర్యాలీ చేపడతామని ప్రకటించాయి.
ఆదివారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్)నేత బాల నంద్‌గావోంకర్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత సచిన్ సావంత్, ఎన్‌సీపీ(ఎస్‌పీ)నేత జయంత్ పాటిల్‌లు మీడియాకు ఈ విషయం తెలిపారు. త్వరలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నకిలీ ఓటర్లను తొలగించాకే నిర్వహించాలని వారు ఈసీని కోరారు. అంతకుముందు, ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే 96 లక్షల ఫేక్ ఓటర్లను జాబితాల్లో చేర్చారని ఆరోపించారు. ఒక్క ముంబైలోనే సుమారు 10 లక్షల నకిలీ ఓట్లున్నాయన్నారు. నకిలీ ఓట్లతో ఎన్నికలు జరపడం ఓటర్లను అవమానించడమేనన్నారు.