
బిహార్ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. మొదటి దశ పోలింగ్‌కు సరిగ్గా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రధాన కూటములు ఎన్డీఏ, మహాఘఠ్‌బందన్ గెలుపు వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం ఎవరు అధిష్టిస్తారనే అనుమానం తాజాగా మొదలయింది. బిహార్‌కు అత్యధిక కాలం సీఎంగా సేవలు అందించిన 74 ఏళ్ల నితీశ్ కుమార్‌కు మరో చాన్స్ ఉంటుందా, లేదా అనే చర్చ నడుస్తోంది. నితీశ్ మద్దతుదారులు మాత్రం ఆయనే మళ్లీ సీఎం అంటూ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
తాజా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే, ఎవరు సీఎం అవుతారనే దానిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలతో నితీశ్ భవితవ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక టీవీ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. "నితీష్ మా ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తారు. ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ముందుగా తమ తమ పార్టీ నాయకులను ఎన్నుకుంటారు. తర్వాత వారు కలిసి కూర్చుని తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయిస్తారు" అని అన్నారు.
నితీశ్‌కు బీజేపీ ధోకా
అమిత్ షా వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. నితీశ్ కుమార్‌కు బీజేపీ ధోకా ఇవ్వడం ఖాయమన్నట్టుగా ప్రచారం మొదలు పెట్టాయి. నితీశ్ మరోసారి సీఎం కాలేరని అమిత్ షా స్పష్టంగా చెప్పారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ మాటలను నమ్మవద్దని ఎక్స్‌లో బీజేపీ వీడియో షేర్ చేసింది. అమిత్ షా మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని, స్వప్రయోజనాల కోసం బిహార్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కమలనాథులు కౌంటర్ ఇచ్చారు.
షాకు చిరాగ్ మద్దతు!
అమిత్ షాకు మద్దతుగా బీజేపీ కీలక మిత్రుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. "ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని ఎన్నుకునే సాధారణ ప్రక్రియ గురించి అమిత్ షా ప్రస్తావించారు. ఐదు పార్టీలతో కూడిన మా కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియను గౌరవించాలి" అని అన్నారు. కాగా, సీట్ల పంపిణీ వ్యవహారంలో చిరాగ్ గట్టిగా పట్టుబట్టి లోక్ జన్ శక్తి పార్టీకి 29 సీట్లు సాధించుకున్న సంగతి తెలిసిందే.
ముందే ప్రకటించాలి
హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మాత్రం భిన్నంగా మాట్లాడారు. కూటమిలో క్లారిటీ, యునిటీ కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించాలన్నారు. ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అంటూ రాష్ట్రీయ లోక్‌మంచ్ (RLM) జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా ప్రకటించారు. నితీశ్ నాయకత్వంలో ఎన్నికల్లో గెలుస్తామని, మళ్లీ అధికారంలోకి వస్తామని మీడియాతో అన్నారు.
పీకే జోస్యం ఫలిస్తుందా?
నితీశ్ కుమార్‌కు ఈసారి అధికార యోగం లేదని జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చెబుతూ వస్తున్నారు. జేడీయూకి పరాభవం తప్పదని, 25 సీట్లు కూడా రావని ఆయన అంటున్నారు. శారీరకంగా అలసిపోయి, మానసికంగా బలహీనపడిన నితీశ్ కుమార్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించలేరని పేర్కొన్నారు. జేడీయూ సంప్రదాయ ఓట్లకు జన్ సురాజ్ పార్టీ గండి కొడుతుందని ప్రశాంత్ కిశోర్ అంచనా వేస్తున్నారు.
చదవండి: 3 కోట్ల లగ్జరీ కారు.. 35 లక్షల బంగారం
నల్లేరు మీద నడక కాదు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ ఫేస్‌గా నితీశ్ కుమార్ ప్రస్తుతం ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితుల గురించి అమిత్ షా సూచనప్రాయంగా వెల్లడించడంతో చర్చ మొదలైంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలు సాధించి, జేడీయూకు తక్కువ సీట్లు వస్తే నితీశ్‌కు సీఎం పదవి కట్టబెడతారా, లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 14న వెలువడే ఎన్నికల ఫలితాలపై నితీశ్ భవితవ్యం ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.