
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. టిక్కెట్లు దక్కించుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన భోజ్‌పురి సూపర్‌స్టార్ ఖేసరి లాల్ యాదవ్ తాజాగా నామినేషన్ వేశారు. సరన్ జిల్లాలోని చాప్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అభ్యర్థిగా పోటీకి దిగారు.
నామినేషన్ వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''నా హృదయం ఎప్పుడూ ఆర్జేడీతోనే ఉంద''ని అన్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ఆయన తన భార్య చందాతో కలిసి ఆర్జేడీలో చేరారు. ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) సాదరంగా ఖేసరి లాల్ యాదవ్, ఆయన భార్యను పార్టీలోకి ఆహ్వానించారు. వారికి స్వయంగా పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.
కాగా, తన ఆస్తుల విలువ ₹24.81 కోట్లు అని ఖేసరి లాల్ యాదవ్ (Khesari Lal Yadav) ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ₹16.89 కోట్ల విలువైన చరాస్తులు, ₹7.91 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. భార్య చందా యాదవ్ కు ₹90.02 లక్షల విలువైన చరాస్తులు, ₹6.49 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. తన అసలు పేరు శత్రుఘ్న యాదవ్‌గా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన వద్ద ₹5 లక్షల నగదు.. తన సతీమణి వద్ద ₹2 లక్షల నగదుతో పాటు ₹35 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 2023–24లో ఖేసరి లాల్ యాదవ్ వార్షిక ఆదాయం ₹73.5 లక్షలుగా ఉంది. 2022–23లో ₹95.02 లక్షలు, 2020–21లో ₹1.01 కోట్లుగా ఉంది. ఖేసరి లాల్ యాదవ్ ఆస్తుల్లో 2023లో కొనుగోలు చేసిన ₹3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ లగ్జరీ కారు కూడా ఉంది.
పాలు అమ్మి.. స్టార్‌గా ఎదిగి
సామాన్య కుటుంబంలో పుట్టిన ఖేసరి లాల్ యాదవ్ తన ప్రతిభతో సెలబ్రిటీగా ఎదిగారు. ఆయన తండ్రి మంగరు యాదవ్ ఒకప్పుడు ఉదయం వీధి వ్యాపారిగా, రాత్రిళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. తన బాల్యంలో తమ గ్రామంలో పశువులను మేపుతూ పాలు అమ్మేవాడినని ఖేకరీ పలు సందర్బాల్లో చెప్పారు. నటుడిగా, గాయకుడిగా ఎదిగిన ఆయన వందకు పైగా భోజ్‌పురి చిత్రాలలో నటించారు. 5 వేలకు పైగా పాటలు పాడారు. తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించాలని భావిస్తున్నారు.
చదవండి: బిహార్ ఎన్నికల్లో 'వెరైటీ' ఫ్రెండ్లీ ఫైట్!
యువతలో ఫాలోయింగ్
భోజ్‌పురిలో ఖేసరి లాల్ యాదవ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత, వలస కార్మికులు ఆయనను బాగా ఇష్టపడతారు. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన సరన్ జిల్లాలో ఖేసరి లాల్ యాదవ్ ప్రభావం ఉంటుందని ఆర్జేడీ అంచనా వేస్తుంది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి విడత పోలింగ్ నవంబర్ 6న, రెండో దశ పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.