
20 నెలల్లో పథకం పూర్తి స్థాయి వర్తింపు
బిహార్ ఎన్నికల్లో ఆర్‌జేడీ హామీ
యువత చూపు ఎన్డీయే వైపేనన్న సర్వేలతో అప్రమత్తం
నితీశ్ ప్రకటించిన నగదు ప్రోత్సాహకాలకు విరుగుడు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ కీలకమైన ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కోటికి పైగా ఉన్న యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోగా ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తెస్తామని, 20 నెలల్లోనే ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
యువతను ఆకట్టుకునేందుకు పోటాపోటీ..
బిహార్‌లోని మొత్తం 7.42 కోట్ల ఓటర్లలో 18–35 ఏళ్ల వారి సంఖ్య 1.60 కోట్ల వరకు ఉంది. ఇటీవల యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని నిర్వహించిన సర్వేలో 18–29 ఏళ్ల వారిలో దాదాపు 44.6 శాతం మంది ఎన్డీయేకు ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారని, 39.5 శాతం మంది మహాఘట్‌బంధన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. సుమారు 42 శాతం మంది బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్‌ను ఇష్టపడుతున్నట్లు తేల్చారు.
కేవలం 27.7 శాతం మంది మాత్రమే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకొనే ముఖ్యమంత్రి నితీష్ ముందుగానే యువతకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ’ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ యోజన’పథకం కింద, 12వ తరగతి అర్హత సాధించిన విద్యార్థులకు రూ. 4,000, ఐటీఐ లేక డిప్లొమా ఉన్నవారికి రూ. 5,000, ఇంటర్న్‌షిప్‌లు తీసుకుంటున్న గ్రాడ్యుయేట్లు లేక పోస్ట్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.6,000 అందిస్తామని ప్రకటించారు. దీంతో పాటే 2025– 26 నుంచి 2030–31 వరకు రాష్ట్రం నుంచి లక్ష మంది యువతకు వివిధ సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లు అందిస్తామని ప్రకటించారు.
దీనిని ఎదుర్కొ ని యువతను తనవైపు తిప్పికునే లక్ష్యంతో ఆర్‌జేడీ నేత తేజస్వీ ‘ఛాత్ర యువ సంసద్’కార్యక్రమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చచేశారు. యువజన కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, విద్యాపరంగా వెనుకబడ్డ విద్యార్థులకు ఇంటి నుంచి ట్యూటర్లను అందిస్తామని, పరీక్షా కేంద్రాలకు ఉచిత రవాణాను కల్పిస్తామని ప్రకటించారు.సైన్స్, గణితం, ఇంగ్లిష్లలో వెనుకబడ్డ ఉన్న విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి వారికి అదనపు సమయం కేటాయిస్తామన్నారు. బిహార్ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు మరోసారి ఉన్నత స్థానాలకు చేరుకునే విధంగా విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
ఇన్ని హామీలు గుప్పించినా ప్రధాని నరేంద్ర మోదీ, నితీశ్‌కుమార్ నిర్వహిస్తున్న బహిరంగ సభలకు యువత పెద్ద సంఖ్యలో హాజరవుతుండటంతో ఎన్నికల షెడ్యూల్ అనంతరం గురువారం తొలి ఎన్నికల వాగ్ధానం ప్రకటించారు. ‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండేలా చూస్తాం. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు దీని కోసం చట్టం తెస్తాం. 20 నెలల్లో ఒక్క ఇళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండదు‘అని ప్రకటించారు. ప్రస్తుత నితీశ్ ప్రభుత్వం 20ఏళ్లుగా ఎన్నడూ నిరుద్యోగం అతిపెద్ద సమస్య అని ఎన్నడూ గుర్తించలేదని, తానుగత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాలను హామీ ఇచ్చి, అధికారంలో ఉన్న కొద్ది కాలంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించానని గుర్తు చేశారు. ఐదేళ్లపాటు పదవిలో కొనసాగితే ఏమి సాధ్యమవుతుందో మీరు ఊహించవచ్చని తేజస్వీ పేర్కొన్నారు.