
పట్నా: దేశంలో ఎక్కడ చూసినా బీహార్ ఎన్నికలకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం మొదలయ్యింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన అధికారిక అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇప్పుడిది ఎంతో ఆసక్తికరంగా మారింది.
ఆర్జేడీ కోట నుండి వరుసగా మూడవసారి విజయం సాధించాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగిన తేజస్వి యాదవ్.. బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏపై పలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో బెరెట్టా పిస్టల్‌తో పాటు రూ. 8.98 కోట్ల విలువైన కుటుంబ ఆస్తులను వెల్లడించారు. అలాగే తనపై 18 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా తెలిపారు. ఆ వివరాలు..
తేజస్వి యాదవ్ ఆస్తులు- రూ 1.88 కోట్లు (స్థిరచరాస్తులు)
భార్య రాజ్‌శ్రీ యాదవ్ ఆస్తులు- రూ 59.69 లక్షలు(స్థిరచరాస్తులు)
ఇద్దరు పిల్లల ఆస్తులు- రూ. 40 లక్షలు(స్థిరచరాస్తులు)
మొత్తం కుటుంబపు చరాస్తులు- రూ. 6.12 కోట్లు
బంగారం, వెండి- రూ. 85.9 లక్షలు- (980 గ్రాముల బంగారం, 3.5 కిలోల వెండి)
ఆయుధాలు- రూ.1.05 లక్షలు ఇటాలియన్ బెరెట్టా ఎన్‌పీబీ 380 బోర్ పిస్టల్, 50 రౌండ్లు
ఎలక్ట్రానిక్స్- రూ. 85 లక్షలు డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్
మొత్తంగా ప్రకటించిన కుటుంబ ఆస్తులు రూ. 8.98 కోట్లు
ఈ అఫిడవిట్‌లో తేజస్వి యాదవ్ పేరు మీద ఏ వ్యక్తిగత వాహనం లేదా రియల్ ఎస్టేట్ వివరాలు లేవు. ఇది తేజస్వి సామాన్యుడనే ఇమేజ్‌ను బలోపేతం చేస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జాబితాలోని ఎలక్ట్రానిక్స్ , ఆయుధం విలువ అతని సామాన్య జీవనశైలికి విరుద్ధంగా ఉన్నాయనే వాదన విపిస్తోంది. కాగా అఫిడవిట్‌లో ఇటాలియన్ బెరెట్టా ఎన్‌పీబీ 380 బోర్ పిస్టల్, 50 బుల్లెట్లను చేర్చడం, దాని విలువ రూ. 1.05 లక్షలుగా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. 1984 నుండి దేశంలో పౌర ఆయుధాల దిగుమతిని నిషేధించారు. ఆయుధ చట్టం- 1959 ప్రకారం అధికారం కలిగిన భారతీయ డీలర్ నుండే ఆయుధాన్ని కొనుగోలు చేయాలి. అయితే తేజస్వి బెరెట్టా పిస్టల్ కలిగివుండటంపై పలు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇది అక్రమంగా వచ్చిన ఆయుధమనే వాదన వినిపిస్తోంది.
తేజస్వి యాదవ్ తన అఫిడవిట్‌లో తనపై 18 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో నాలుగు అప్పీల్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులు రాజకీయ ర్యాలీలు, నిరసనలు, వివాదాస్పద ప్రకటనల కారణంగా నమోదయ్యాయి. తాజగా అక్టోబర్ 13న ఢిల్లీ కోర్టు.. ఆయనతో పాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీ దేవిలపై ఐఆర్‌సీటీసీ హోటళ్ల అవినీతి కుంభకోణం, ల్యాండ్-ఫర్-జాబ్స్ స్కామ్‌లో అధికారికంగా అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఇది ఎన్నికలకు ముందు తేజస్వికి ఎదురుదెబ్బగా మారింది.
రాఘోపూర్ నియోజకవర్గం ఆర్జేడీకి ఎంతో కీలకమైనది. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ఇద్దరూ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమిది. తేజస్వి 2015, 2020లలో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇక్కడి ఓటర్లలో యాదవులు 25 శాతం, ముస్లింలు 20 శాతం, ఈబీసీలు 30 శాతం ఉన్నారు. ఇది ఆర్జేడీ విజయానికి కీలకమైన జనాభాగా పరిగణిస్తుంటారు. హాజీపూర్ కలెక్టరేట్‌లో తేజస్వి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశాక తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ‘ఎక్స్’ ఖాతాలో ‘ఈ నామినేషన్ తేజస్వి ఒక్కడికే కాదు.. బీహార్ అంతటా మార్పు కోసం’ అని పేర్కొన్నారు.