
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార ఎన్డీయే కూటమిలో లుకలుకలు నడుస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అలాగే.. బీహార్ సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపైనా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ స్పష్టత ఇచ్చారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు(Amit Shah On Bihar CM Candidate). బీహార్ ఎన్డీయే కూటమిలో పార్టీల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పనికి మాలినవని తోసిపుచ్చారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోనే బీహార్ ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని షా ప్రస్తావించారు. అయితే.. బీహార్ ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు.. అంత తొందర ఎందుకంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతారా? కారా?(Will Nitish Kumar CM Again) అనేది నేను ఒక్కడినే నిర్ణయించే అంశం కాదు. ప్రస్తుతానికి ఆయన సారథ్యంలోనే మేం ఎన్నికలకు వెళ్తున్నాం. ఎన్నికలయ్యాక.. మిత్రపక్షాలన్నీ కూర్చుని అప్పుడు సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తాయి అని షా స్పష్టత ఇచ్చారు.
గత ఎన్నికల్లో(2020) జేడీయూ కంటే బీజేపీ అత్యధిక స్థానాలు నెగ్గింది. ఆ టైంలో నితీశ్ కుమార్ ప్రధాని మోదీని కలిసి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండడం సబబని అన్నారు. కానీ, మా మిత్రపక్షానికి మేం ఎప్పుడూ గౌరవం ఇస్తాం. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఆయన్ని సీఎం చేశాం అని షా అన్నారు.
నితీశ్ తరచూ పార్టీలు మారుతున్న సందర్భాన్ని ప్రస్తావించగా.. షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1974లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణన్ సారథ్యంలో జరిగిన ఆందోళనతో నితీశ్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని, అది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సందర్భాన్ని గుర్తు చేశారు. పైగా నితీశ్ రెండున్నరేళ్లు మాత్రమే కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగించారని.. ఎక్కువ కాలం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇక..
నితీశ్ ఆరోగ్యం, పబ్లిక్‌లో ఆయన ప్రవర్తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా అమిత్ షా స్పందించారు. వయసు కారణంగా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కానీ, ముఖాముఖిగా, ఫోన్ ద్వారానూ నితీశ్ సుదీర్ఘంగా, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారని షా అన్నారు. అంతేకాదు.. సీఎంగా ఆయన సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు.
ఇక.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Elections 2025) ఎన్డీయే కూటమి మునుపెన్నడూ చూడని ఘన విజయం సాధిస్తుందని.. నవంబర్ 14న వెల్లడయ్యే ఫలితాలతో గత రికార్డులను బద్దలు కొడతామని షా ధీమా వ్యక్తం చేశారు.
74 ఏళ్ల వయసున్న నితీశ్‌కుమార్ ఇప్పటికే 9 సార్లు(2000 సంవత్సరంలో తొలిసారి) బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ఆయన బీహార్ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని, గవర్నర్‌గానో, రాజ్యసభకో వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. అంతెందుకు మొన్నీమధ్యే ఉప రాష్ట్రపతి పదవి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కూడా. అయితే నితీశ్ 10వ సారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని జేడీయూ అంటోంది.
ఇదీ చదవండి: కరూర్ ఘటన తర్వాత.. విజయ్ క్రేజ్ మరింత పెరిగిందా?