
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు(టీవీకే), సినీ నటుడు విజయ్‌కు(TVK Vijay) ప్రజల నుంచి మద్దతు పెరిగినట్టు ఓ సర్వేలో వెలుగు చూసింది. ఆయనకు తాజాగా 23 శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తేలింది. విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కరూర్‌లో(Karur Stampade) ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆ పార్టీ(Tamil nadu) వర్గాలను కాస్త డీలా పడేలా చేసింది. విజయ్ సైతం తీవ్ర మనోవేదనలో పడ్డారు.
తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సీబీఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతంపై విజయ్ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులలో ఉన్నారు. ఎక్కువ శాతం జిల్లాల కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నట్టు సమాచారం వెలువడింది. ఈ సమావేశాలు, సంప్రదింపులు తదుపరి పార్టీ పరంగా విజయ్ కొన్ని మార్పు, చేర్పుల ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్టు చర్చ ఊపందుకుంది.
ఈ పరిస్థితులలో విజయ్‌కు మరింత ఉత్సాహం తెప్పించే రీతిలో తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. ఇటీవల ముంబైకు చెందిన ఓ సంస్థ సర్వే జరపగా 2026 ఎన్నికలలో విజయ్ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయన్న సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా జరిపిన సర్వేలో కరూర్ ఘటనతో విజయ్‌కు ప్రజాదరణ మరింతగా పెరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ప్రజలలో ఆయనపై ఆదరణ అన్నది తగ్గలేదని, అదే సమయంలో తాజాగా 23 శాతం మద్దతు ఆయనకు పెరిగినట్టుగా పేర్కొంటూ వెలువడ్డ సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి.