
కరూర్ తొక్కిసలాట ఘటన.. తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అయితే తాము తొణకని కుండలా ఉంటామని టీవీకే చెబుతున్నప్పటికీ.. బీజేపీ తన మైండ్ గేమ్ ప్రారంభించిందనే విశ్లేషణ అక్కడి రాజకీయ నిపుణులు చేస్తున్నారు. అందుకు విజయ్ పాటిస్తున్న మౌనం ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.
కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత.. బీజేపీ అధికార డీఎంకేనే టార్గెట్ చేసింది. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంటోంది. అయితే టీవీకే ఆరోపిస్తున్నట్లు కుట్ర కోణాన్ని మాత్రం సమర్థించడం లేదు. ఈ క్రమంలో.. ఆ పార్టీ అగ్రనేత ఒకరు విజయ్‌కు సంఘీభావం ప్రకటించారని, డీఎంకే గనుక లక్ష్యంగా చేసుకుంటే మద్దతు కూడా ఇస్తామని చెప్పారని తమిళ మీడియా చానెల్స్ మొన్నీమధ్య కథనాలు ఇచ్చాయి.
ఆ వెంటనే.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి బలపడే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే..
ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అక్టోబర్ 9వ తేదీన టీవీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే (AIADMK) ర్యాలీల్లో టీవీకే జెండాలు పట్టుకున్నవాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని స్పష్టత ఇచ్చింది. కట్ చేస్తే..
తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బలైమన చేరికలతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతం కానుందని, అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు’’ అంటూ చెబుతూ నవ్వులు చిందించారామె. దీంతో అది విజయ్ అని మళ్లీ చర్చ మొదలైందక్కడ.
అయితే.. కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.
కరూర్ ఘటనపై సుప్రీం కోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జితో సిట్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే పొత్తులపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. దీంతో ఇటు టీవీకే కేడర్, అటు అభిమానులు అయోమయంలో పడిపోయారు.
ఎన్డీయే చేరాలనే ప్రచారంపై విజయ్ ఇప్పటిదాకా స్పందించకపోవడంపై టీవీకేలో ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆయన మౌనం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని.. పరిస్థితి మరింత ముదరక ముందే స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.