
తమిళనాడులోని కరూర్ ఘటనలో 40కి చేరిన మరణాలు
ఘటనపై 24 గంటల్లో నివేదిక సమర్పించాలని గవర్నర్ ఆదేశం
ఘటనకు భద్రతా వైఫ్యలమే కారణమన్న అన్నాడీఎంకే
బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ ప్రచార కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ప్రమాదమా.. లేక ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ లేదా సిట్ విచారణ కోరుతూ ఆ పార్టీ న్యాయవాద విభాగం మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. తొక్కిసలాట ఘటనతో తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులు రాత్రికి రాత్రే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఏడీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదంతో పాటు ఐదుగురు ఐజీలు, డీజీఐలు ఘటనా స్థలంలో విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనలో మొత్తం 40 మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 14 మంది పురుషులు, 17 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో వంద మందికి పైగా చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత పళణిస్వామితో పాటు డీఎండీకే, బీజేపీ, తదితర పార్టీ ల నేతలంతా కరూర్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు.
ఈ ఘటన ప్రభుత్వ భద్రతా వైఫ్యలమే కారణమని పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం పెద్దఎత్తున తరలి వస్తున్నారన్న విషయాన్ని గ్రహించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. విజయ్ సైతం ముందస్తు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేసుకుని ఉండాల్సిందని హితవు పలికారు. కాగా.. ఈ ఘటనపై 24 గంటల్లో నివేదిక సమర్పించాలని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి డీఎంకే ప్రభుత్వాన్ని ఆదేశించారు.
సీబీఐ దర్యాప్తునకు టీవీకే డిమాండ్
కరూర్‌లో బాధితుల సమాచారం, మరికొందరు వైరల్ చేస్తున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన ప్రమాదమా? లేక కుట్ర జరిగిందా..? అన్న అనుమానాలకు దారితీసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీవీకే న్యాయవాది విభాగం బృందం చెన్నైలో న్యాయమూర్తి దండపాణిని కలిసి సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. ప్రచారంలో రాళ్లు విసిరినట్టు, లాఠీచార్జ్ జరిగినట్టు వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్రగా న్యాయమూర్తికి వివరించారు.
కేసును సీబీఐ లేదా సిట్ ద్వారా విచారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్ దాఖలు చేస్తే సోమవారం మధ్యాహ్నం విచారణకు స్వీకరిస్తామని న్యాయమూర్తి సూచించగా.. ఆ దిశగా మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాల వారికి రూ.20 లక్షల చొప్పున విజయ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ప్రకటించారు. తాను సైతం కరూర్ వెళ్లేందుకు సిద్ధమైనా, పోలీసుల నుంచి అనుమతి రాలేదు.
కాగా.. విజయ్ ఇంటివైపు కొన్ని విద్యార్థి సంఘాలు దూసుకెళ్లడంతో ఆ పరిసరాలన్నీ సీఆర్‌పీఎఫ్ భద్రతా వలయంలోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విజయ్ ప్రచారాలపై నిషేధం విధించాలని కోరుతూ సెంథిల్ కన్నన్ అనే బాధితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇదిలావుండగా కరూర్ ఘటనకు బాధ్యులుగా టీవీకే పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సీనియర్ నేత నిర్మల్‌కుమార్‌తో పాటు ఇతరులు అని పేర్కొంటూ మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు ఈ ఘటనపై జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. వేలుస్వామిపురంలో పరిశీలన, విచారణ జరిగింది. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా ఆపేశారంటూ కొందరు, ఒక్కసారిగా జనం తోసుకొచ్చారంటూ మరికొందరు, అంబులెన్స్‌లు వరుసగా రావడంతో వాటికి దారి ఇచ్చే సమయంలో తోపులాట జరిగిదంటూ మరికొందరు తెలిపారు.