నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్. నటి పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమితా బైజు ముఖ్యభూమికలు పోషించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ పిక్చర్స్ భారీ బడ్జెట్లో నిర్మించింది. హెచ్.వినోద్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2026 జనవరి 9వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ప్రస్తుతం ఆయన తమిళగ వెట్రికళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

దీంతో జననాయకన్ చిత్రాన్ని తన రాజకీయ జీవితానికి తోడ్పడేలా రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. దీంతో జననాయకన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలోని మూడు పాటలు ఇప్పటికే విడుదలై విజయ్ అభిమానుల్లో జోష్‌ను నింపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 27న చెన్నైలో కాకుండా మలేషియాలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు.
విజయ్ సతీమణి పాల్గొంటారా?
జననాయకన్ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై నుంచి పలువురు సినీ ప్రముఖులు మలేషియాకు వరుస కట్టారు. ముఖ్యంగా దర్శకుడు అట్లి, నెల్సన్ తదితరులు మలేషియాకు మలేషియాకు వెళ్లారు. నటుడు విజయ్ కూడా తన తల్లి శోభ చంద్రశేఖర్, బంధువు, గాయని పల్లవి వినోద్ తదితరులు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి మలేషియాకు చేరుకున్నారు.
అదేవిధంగా విజయ్ భార్య సంగీత, కొడుకు జెసన్ సంజయ్ కూడా మలేషియాకు వెళ్లారు. అయితే వీరు జననాయకన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నటుడు విజయ్ ఆయన భార్య సంగీత మధ్య సఖ్యత లేదంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అలాంటిది సంగీత ఆమె కొడుకు, కూతురు దివ్య సాషా జననాయక్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటే ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి తెరదించినట్లు అవుతుంది.


