
సాక్షి, చైన్నె: తమిళనాడులో(Tamil Nadu) కరూర్ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన నుంచి బాధితులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరవైపు.. టీవీకే అధినేత విజయ్(TVK Vijay).. పలువురు బాధితులను పరామర్శించినట్టు సమాచారం. వీడియోలో వారిని పలకరించినట్టు తెలుస్తోంది. కాగా, బాధితులను కలిసేందుకు విజయ్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీని అనుమతి కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల ప్రకారం.. కరూర్(Karur Stampade) బాధితులల్లోని పలువురికి టీవీకే నేత విజయ్ వీడియో కాల్ ద్వారా పరామర్శించినట్టు తెలిసింది. త్వరలో నేరుగా వచ్చి కలుస్తానని వారికి ఆయన భరోసా ఇచ్చినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీకి సంబంధిత స్థానిక నేతల ద్వారా సేకరించిన నెంబర్ల ఆధారంగా బాధితులకు విజయ్ వీడియో కాల్ చేసి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కరూర్ బాధితులను కలిసేందుకు విజయ్.. రాష్ట్ర డీజీపీ(Tamil Nadu DGP) కోరినట్టు సమాచారం. ఈ మేరకు తమిళనాడు డీజీపీకి విజయ్ ఈమెయిల్ పంపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, విజయ్ మెయిల్‌కు డీజీపీ ఎలాంటి సమాచారం ఇచ్చారు అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. గత నెల 27వ తేదీన కరూర్‌లో టీవీకే విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెనువిషాద ఘటనలో 41 మంది మరణించారు. వీరికి విజయ్ పార్టీ తరపున తలా 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు బాధితులను కలుస్తూ తమ సానుభూతి తెలియజేసే పనిలో పడ్డారు. ముఖ్య నేతలందరూ కేసులకు భయపడి అజ్ఞాతంలో ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విజయ్ కరూర్ నుంచి చైన్నెకు వచ్చేయడం చర్చకు దారి తీసింది. ఇందుకు ఆయన వీడియో రూపంలో వివరణ కూడా ఇచ్చారు. కరూర్‌కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును సైతం విజయ్ ఆశ్రయించి ఉన్నారు.
అదే సమయంలో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ సైతం ఈ కేసుపై విచారణను వేగవంతం చేసింది. మూడో రోజుగా ఈ బృందం తాంథోని మలైలోని అతిథి గృహంలో తిష్ట వేసి, పోలీసులు సమర్పించిన నివేదిక, లభించిన సీసీ ఫుటేజీలతో పాటూ బాధితుల నుంచి సేకరించిన సమాచారాలను సమగ్రంగా పరిశీలించే పనిలో నిమగ్నమైంది.