‘మీరేం ఒంటరి కాదు..’ విజయ్‌కు దన్నుగా ఢిల్లీ పెద్దలు! | After Congress Now BJP Approaches Vijay After Karur Incident | Sakshi
Sakshi News home page

‘మీరేం ఒంటరి కాదు..’ విజయ్‌కు దన్నుగా ఢిల్లీ పెద్దలు!

Oct 4 2025 5:08 PM | Updated on Oct 4 2025 6:27 PM

After Congress Now BJP Approaches Vijay After Karur Incident

కరూర్‌ తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందంటూ విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగళం(TVK) మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే మద్రాస్‌ హైకోర్టు మాత్రం కనీస ఆహారం, మంచి నీళ్ల సదుపాయం కల్పించలేని స్థితిలో ర్యాలీని ఎందుకు నిర్వహించారని, ఘటన తర్వాత అక్కడి నుంచి ఎందుకు పారిపోయారని.. ప్రశ్నలు గుప్పిస్తూనే ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో..

తమిళ రాజకీయాల్లో విజయ్‌ టీవీకే పార్టీ(Vijay TVK Party) మనుగడపై అనిశ్చితి నెలకొంది. ఘటనకు విజయ్‌, టీవీకే పూర్తి బాధ్యత అంటూ అధికార డీఎంకే విమర్శలతో తిట్టిపోస్తోంది. ఇటు సోషల్‌ మీడియాలోనూ విజయ్‌కు వ్యతిరేక క్యాంపెయిన్‌ నడుపుతూ.. ఈ వేడి చల్లారకుండా చూసుకుంటోంది. అయితే ఈ అనిశ్చితినే తమకు ఫ్లస్‌గా మల్చుకునేందుకు ఇటు జాతీయ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

తాజాగా బీజేపీకి చెందిన ఓ అగ్రనేత విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం(BJP Phone Call to TVK Vijay).  ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే.. విజయ్‌ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. ‍వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్‌కు సూచించినట్లు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇదివరకే విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించి వివరాలను ఆయన ఆరా తీశారు. తద్వారా పరోక్షంగా విజయ్‌కు సానుభూతి ప్రకటించడంతో పాటు అండగా నిలబడతామని ఈ రెండు జాతీయ పార్టీలు సంకేతాలు అందించాయనేది స్పష్టమవుతోంది(Congress BJP Backs Vijay).

కరూర్‌ ఘటనలో(Karur Stampede).. డీఎంకే పార్టీనే మెయిన్‌ టార్గెట్‌ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ఇక ఘటన తర్వాత.. ఆగమేఘాల మీద, అదీ మునుపెన్నడూ లేని రీతిలో తమ ఎంపీలను బృందంగా తమిళనాడుకు పంపింది. ఈ బృందం కరూర్‌ను పరిశీలించి.. బాధితులతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. టీవీకేతో పాటు డీఎంకే ప్రభుత్వం కూడా కరూర్‌ ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని ఆ కమిటీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ర్యాలీకి అనుమతి ఇవ్వడం, సరైన భధ్రత కల్పించకపోవడం లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.

ఇటు కాంగ్రెస్‌.. డీఎంకేతో పొత్తులో కారణంగా తటస్థ వైఖరి అవలంభిస్తోంది. అందుకే ఘటనపై అధికార, టీవీకే పార్టీల్లో ఎవరినీ నిందించడం లేదు. కేవలం సానుభూతి ప్రకటన, నష్టపరిహారం అందజేత లాంటివి మాత్రమే చేసింది. దీంతో ద్రవిడ పార్టీల డామినేషన్‌ను తట్టుకుని ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందా? అనే అనుమానాలకు తావిస్తోంది.

అయితే.. బీజేపీ, కాంగ్రెస్‌లు చేస్తున్న ఈ ప్రయత్నాలు విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్‌ బేస్‌ను ఆకర్షించే ప్రయత్నంగానే కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సమీకరణం.. మారేనా?
వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే టీవీకే వెళ్తుందని.. సింహం సింహమేనని, సింగిల్‌గా పోటీకి వెళ్తుందని.. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని.. తాను ఏ కూటమిలో భాగం కాదని, అయితే అధికార ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలకు భాగం ఇస్తానని విజయ్‌ ఇదివరకు ప్రకటించారు. అయితే కరూర్‌ ఘటన నేపథ్యంలో.. ఆ నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు!.

ఇప్పటికే విజయ్‌ తొక్కిసలాట ఘటనలో తనకు మద్దతు తెలిపిన జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ సంగతేమోగానీ.. బీజేపీ+అన్నాడీఎంకే మాత్రం ఎలాగైనా విజయ్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చని, డీఎంకే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టీవీకే అధినేత కూడా అందుకు ఓకే చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మాత్రం విజయ్‌ను నమ్ముకుని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన చిన్న పార్టీలకు పెద్ద షాకే అని చెప్పొచ్చు.

ఇదీ చదవండి: తమిళ రాజకీయాల తొక్కిసలాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement