
కాబూల్: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్-ఆప్ఘన్ బంధంపై విమర్శలు చేస్తున్న పాకిస్తాన్‌కు ఆప్ఘనిస్తాన్ రక్షణమంత్రి మవ్లావీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్(Mawlawi Mohammad Yaqoob) స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. భారత్‌తో తమ బంధం తమ స్వతంత్ర నిర్ణయమని, ఈ విషయంలో పాకిస్తాన్(Pakistan) వాదన అసంబద్దమైనదని అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, దాయాది పాక్‌కు భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.
ఇటీవలి కాలంలో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణం భారత్ అంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. భారత్ వల్లే ఆఫ్ఘనిస్థాన్ దాడులు చేస్తోందనే వాదనపై తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి మౌలావి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ వ్యాఖ్యలు నిరాధారం.. అశాస్త్రీయమైనది. పాక్ ఆరోపణలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆఫ్ఘనిస్థాన్ స్వతంత్ర దేశంగా భారత్‌తో సంబంధాలను కొనసాగిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్‌తో మంచి సంబంధాలను కూడా కోరుకుంటుంది.
రెచ్చగొడితే మూల్యం తప్పదు..
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఎవరికీ ఉపయోగపడవు. మా విధానంలో ఆఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించడం ఎప్పుడూ ఉండదు. పాకిస్తాన్ దోహా ఒప్పందాన్ని గౌరవించడంలో విఫలమైతే మళ్లీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ దాడులు జరిపితే ఆఫ్ఘనిస్థాన్ తన భూభాగాన్ని ధైర్యంగా రక్షించుకుంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులను ఉగ్రవాదులుగా పాకిస్తాన్ ముద్ర వేయడాన్ని కూడా ఆయన విమర్శించారు. ఈ పదానికి స్పష్టమైన నిర్వచనం లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఇదిలాఉండగా.. పశ్చిమాసియాలో కీలకమైన ఆఫ్ఘనిస్థాన్‌తో బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలమిస్తున్నాయి. దీంతో అక్కడి తాలిబాన్ ప్రభుత్వంలో మంత్రులు భారత్‌కు అనుకూలంగా స్వరం పెంచుతున్నారు. ఇప్పటికే తాలిబాన్ విదేశాంగమంత్రి భారత్‌లో వారం రోజుల పాటు పర్యటించి వెళ్లారు. దీంతో పొరుగుదేశం పాక్‌లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్-ఆప్ఘన్ బంధంపై పాకిస్తాన్ విమర్శలకు దిగుతోంది. అలాగే, దాడులకు పాల్పడింది. దీంతో ఈ వ్యవహారంలో మళ్లీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలదూర్చాల్సి వస్తోంది.