
హెచ్–1బీపై ట్రంప్ సర్కార్ స్పష్టికరణ
న్యూయార్క్: హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులందరిపై ఏకంగా ఒకేసారి లక్ష డాలర్ల ఫీజు గుదిబండ పడేసిన ట్రంప్ సర్కార్ హఠాత్తుగా ఒక వర్గం వారికి మాత్రం భారీ లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటూ విద్యనభ్యసిస్తూ హెచ్–1బీ కోసం దరఖాస్తుచేసుకున్న విద్యార్థులు ఈ అధిక వీసా ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) విభాగం ఒక నోటిఫికేషన్ జారీచేసింది.
ఇప్పటికే అమెరికాలోని పలు రంగాల సంస్థల్లో పనులు చేస్తున్న విదేశీయులు చేసే దరఖాస్తులకు సైతం లక్ష డాలర్ల మినహాయింపు వర్తిస్తుందని యూఎస్‌సీఐఎస్ ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, అక్కడి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయులకు భారీ లబ్ధిచేకూరనుంది. విదేశాల్లోని వ్యక్తులు చేసే హెచ్–1బీ వీసా దరఖాస్తులకు మాత్రం లక్ష డాలర్ల ఫీజు ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.
అమెరికాలో విద్యనభ్యసిస్తూ ఎఫ్–1వీసా ఉండి దానికి హెచ్–1బీ వీసాగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. సెపె్టంబర్ 21వ తేదీ మొదలవగానే అర్ధరాత్రి 12.01 నిమిషాల తర్వాత వచ్చే ప్రతి విదేశీ హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులు తప్పకుండా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏఏ వర్గాల వారికి ఈ అధిక ఫీజు మినహాయింపు ఉంటుందనే దానిపై సోమవారం యూఎస్‌సీఐఎస్ ఈ ప్రకటనలో స్పష్టతనిచ్చింది..
హాయిగా వెళ్లిరావొచ్చు
ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉన్న విదేశీయులు అత్యవసర పనుల నిమిత్తం స్వదేశం లేదా విదేశాలకు వెళితే మళ్లీ తిరిగొచ్చేటప్పుడు వీసా నిబంధనలు ప్రతిబంధకంగా మారుతాయన్న భయంతో చాలా మంది ఎక్కడికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే ఉండిపోతున్నారు. ఇలాంటి భయాలు అక్కర్లేదని హాయిగా అమెరికా నుంచి విదేశాలకు వెళ్లిరావొచ్చని ప్రభుత్వం స్పష్టంచేసింది. ‘‘హెచ్–1బీ వీసా పొడిగింపు, హెచ్–1బీ వీసాగా మార్పు, నివాస స్థితి పొడిగింపు వంటి దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నందున ఈలోపు అంతర్జాతీయ విమానప్రయాణం చేస్తే తమ వీసా స్టేటస్‌కు ముప్పు వస్తుందనే భయం ఎవరికీ అక్కర్లేదు’’అని గ్రీన్ అండ్ స్పైగల్ న్యాయసేవల సంస్థ ఉన్నతాధికారి డ్యాన్ బెర్జర్ చెప్పారు.
చిన్న మెలిక పెట్టిన ప్రభుత్వం
అయితే, ఇప్పటికే అమెరికాలో ఉంటూ చదువుకుంటున్న లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్న విదేశీయులు చేసే ‘హెచ్–1బీ వీసాగా మార్పు’,‘నివాస స్థితి పొడిగింపు’,‘స్టేటస్ మార్పు’వంటి అభ్యర్థనలకు వాళ్లు అనర్హులు అని తేలితే వాళ్ల నుంచి కూడా లక్ష డాలర్ల ఫీజు వసూలుచేస్తామని యూఎస్‌సీఐఎస్ వ్యాఖ్యానించింది. ఈ లెక్కన ఏ దరఖాస్తునైనా ఉద్దేశపూర్వకంగా అనర్హమైనదిగా ప్రకటించి లక్ష డాలర్ల రుసుం కట్టాల్సిందేనని ఇమిగ్రేషన్ విభాగం ప్రకటిస్తే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
కొత్తగా విదేశాల నుంచి చేసే దరఖాస్తులకే లక్ష డాలర్ల ఫీజు ఉంటుంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉండి, దాని రెన్యూవల్ దరఖాస్తు ఆమోదం/పెండింగ్ స్థితిలో ఉండగా స్వదేశం వెళ్లిపోయిన విదేశీయులు మళ్లీ అమెరికాలోకి విమానంలో వచ్చినా వాళ్లకు సైతం ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు మొదట అమెరికాలోనే చదువుకోవాలనేదే ట్రంప్ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టమవుతోంది.
గత కొన్నాళ్లుగా హెచ్–1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. భారతీయులు అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, వీరికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంలోనే లక్ష డాలర్ల ఫీజు ట్రంప్ తీసుకొచ్చారని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా 65,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తోంది. ఇవిగాక అమెరికాలోనే మాస్టర్స్, అంతకుమించిన ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అర్హతల మేరకు మరో 20,000 హెచ్–1బీ వీసాలను అందజేస్తోంది.