
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. కొత్త H-1B వీసా దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్(USCIS) పేర్కొంది. హెచ్1బీ ఫీజు పెంపుపై స్పష్టత ఇచ్చే క్రమంలో పలు వివరాలను వెల్లడించింది.
హెచ్-1బీ ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుంచి దరఖాస్తు చేసుకొన్నవారికే వర్తిస్తుందని పేర్కొంటూ అమెరికాలో చదువుకొంటున్న విద్యార్థులకు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ తీపి కబురు చెప్పింది. అలాగే.. ఫీజు పెంపు ప్రకటన వెలువడే సమయానికి అమెరికాలోనే ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. 2025 సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ప్రెసిడెన్షియల్ ప్రోక్లమేషన్’ విడుదల చేశారు. దీని ప్రకారం, కొత్త H-1B వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధించబడుతుంది. ఈ ఫీజు 2025 సెప్టెంబర్ 21 నుంచి కొత్త H-1B వీసా పిటిషన్లకు వర్తించడం అమలైంది. అయితే.. USCIS అక్టోబర్ 20న ఫీజు అమలులో పారదర్శకత, మినహాయింపు విధానం, అర్హత ప్రమాణాలు గురించి వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను తెలియజేసింది.
మరోవైపు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా మాట్లాడుతూ.. F-1 (విద్యార్థి వీసా), L-1 (ఇంటర్‌కంపెనీ ట్రాన్స్‌ఫర్ వీసా) లబ్ధిదారులు ఈ భారీ ఫీజు నుంచి విముక్తి పొందారని తెలిపారు. ఇది విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపశమనం కలిగించే నిర్ణయమని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మార్పులు అమెరికాలో ఉన్న ఉద్యోగదారులకు, అలాగే విద్యార్థులకు.. ఇమ్మిగ్రేషన్ ఖర్చులను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో నుంచే H-1Bకి మారుతారు. కాబట్టి. ఈ భారీ ఫీజు వాళ్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట.