
స్టూడెంట్ వీసాలు తాత్కాలికంగా నిలిపివేత
తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో కలవరం
అమెరికా ఆంక్షలతో 54 వేల మందిలో ఆందోళన
భారతీయులు భయపడాల్సిన పనిలేదంటున్న కన్సల్టెన్సీలు
సోషల్ మీడియా ఖాతాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు
అమెరికా వెళ్లదలచుకున్న వారి నేపథ్యాలను ఆరా తీస్తున్న కన్సల్టెన్సీ వర్గాలు
వీసా వస్తుందో లేదో..?
నాకు అమెరికా యూనివర్సిటీలో సీటు ఖరారైంది. అప్పులు చేసి అన్ని విధాలుగా సిద్ధమయ్యా. ఆగస్టులో వెళ్లాలి. కానీ ఇంతవరకూ వీసా ఇంటర్వ్యూకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో మొదటి సెమిస్టర్‌కు వెళ్లగలనా? లేదా అనే భయం వెంటాడుతోంది.
– శశాంక్ ఇరుకుపాటి (అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన మహబూబ్‌నగర్ విద్యార్థి)
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు భారతీయ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలవర పెడుతున్నాయి. స్టూడెంట్ వీసాలకు ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని కాన్సులేట్ అధికారులను అగ్రదేశం ఆదేశించడం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న వారిని గందరగోళానికి గురి చేస్తోంది. తమ దేశంలోని కొన్ని యూనివర్సిటీల్లో ఉగ్రవాద సమర్థనీయ చర్యలున్నాయని అమెరికా ప్రభుత్వం అనుమానిస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అంటున్నారు.
అమెరికా రావాలనుకునే ప్రతి విద్యార్థి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని అధికారులకు అమెరికా ఆదేశాలు ఇచ్చింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయోనని అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ వీసా కోసం సిద్ధమైతే అమెరికా ప్రభుత్వం నుంచి రోజుకో నిర్ణయం వెలువడుతోందని కంగారు పడుతున్నారు.
అయితే అమెరికా నిర్ణయాలు భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది కల్గించవని ప్రవాస భారతీయులు అంటున్నారు. కానీ అమెరికా ఈ ఏడాది 41 శాతం విద్యార్థి వీసాలను తిరస్కరించింది. ఇందులో భారతీయుల వీసాలు 38 శాతం ఉండటం గమనార్హం. కాగా ఇప్పటికే వీసా ఇంటర్వ్యూకు తేదీ ఖరారైన వారిని అనుమతించాలని అమెరికా సూచించడం ఆయా విద్యార్థులకు ఊరటనిస్తోంది.
ఈ ఏడాది ఇప్పటికి 6 వేల మందికి తిరస్కరణ: భారత్ నుంచి ప్రతి ఏటా 7 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. ఇందులో 3 లక్షల మంది అమెరికా దేశానికే వెళ్తున్నారు. చదువు కోసం ఆ దేశానికి మన విద్యార్థులు ప్రతి ఏటా రూ.లక్ష కోట్లు చెల్లిస్తున్నారని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికన్ యూనివర్సిటీలు ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే సెమిస్టర్లకు రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి.
మనవారు మొదటి సెమిస్టరే ఎంపిక చేసుకుంటారు. దీంతో ఆరు నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నిస్తారు. విద్యార్థులకు ఎఫ్1 వీసా ఇస్తారు. దీన్ని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అంటారు. అమెరికాలో ఫుల్ టైం విద్యకు ఇది అవకాశం కల్పిస్తుంది. కాగా 2023లో 1.03 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు ఇచ్చినట్టు బ్యూరో ఆఫ్ కాన్సులేట్ అఫైర్స్ నెలవారీ నివేదిక పేర్కొంది.
అయితే 2023–24లో ఎఫ్1 వీసాలను భారీగా తగ్గించారు. ప్రపంచ వ్యాప్తంగా 6.79 లక్షల మంది దరఖాస్తు చేస్తే ఇందులో 2.79 లక్షలు అప్లికేషన్లను అమెరికన్ కాన్సులేట్లు తిరస్కరించాయి. 2024 తొలి 9 నెలల్లోనే భారతీయ విద్యార్థులు 38 శాతం మందికి అమెరికా వీసాలు తిరస్కరించింది.
ఈ ఏడాది తొలి సెమిస్టర్ కోసం దాదాపు 78 వేల మంది వీసా కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 24 వేల మందికి ఇంటర్వ్యూ తేదీలు వచ్చాయి. కొందరి ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో 6 వేల మంది వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యారు. ఇక 54 వేలమంది ఇంటర్వ్యూ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు.
అలాంటి వారిని అడ్డుకునేందుకే..
అమెరికన్ కాన్సులేట్ వర్గాలు, కన్సల్టెన్సీ సంస్థలు, ప్రవాస భారతీయుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. వీసాల విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నదే అమెరికా ఆలోచన. ఉద్రిక్తతతలు, అసాంఘిక కార్యకలాపాలు, సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్న వారిని తమ దేశంలోకి రాకుండా చేయాలని ఆ దేశం భావిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలిస్తోంది.
అమెరికా వెళ్ళే ముందు వారు ఎవరిని సంప్రదిస్తున్నారు? వారి నేపథ్యం ఏమిటి? ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఎవరితో ఉండాలనే ఆలోచనలో ఉన్నారు? ఏ కన్సల్టెన్సీని ఎంపిక చేసుకుంటున్నారు? ఆ కన్సల్టెన్సీ ద్వారా గతంలో ఎంతమందిని పంపారు? వాళ్ళ నేపథ్యం ఏమిటి? ఇలాంటి వివరాలు అమెరికా కన్సల్టెన్సీ వర్గాలు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న తమ స్నేహితులు, బంధువులకు..అనుమానించదగ్గ వ్యక్తులు, రెడ్ లిస్ట్‌లో ఉన్న దేశాల వారితో సంబంధం ఉంటే మరింత లోతుగా పరిశీలించే అవకాశం ఉంది.
భారతీయ విద్యార్థులకు ఇబ్బంది లేదు!
ప్రస్తుతానికి భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులెదురయ్యే అవకాశం లేదని కన్సల్టెన్సీల ప్రతినిధులు, విదేశీ విద్యకు సంబంధించిన నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి అమెరికా కొన్ని దేశాలపైనే దృష్టి పెట్టిందని అంటున్నారు. తమ దేశానికి వస్తున్న 41 దేశాల విద్యార్థులను కేటగిరీలుగా విభజించింది. రెడ్ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న దేశాలను చేర్చారు.
ఇంకా చెప్పాలంటే ఇస్లాం వాదంతో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఆప్ఘనిస్తాన్, ఇరాన్, లిబియాతో పాటు భూటాన్, క్యూబా సహా 11 దేశాలున్నాయి. ఉగ్రవాద ప్రేరేపిత, ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలతో వాణిజ్య మైత్రి కొనసాగిస్తున్న 10 దేశాలను ఆరంజ్ కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలో పాకిస్తాన్, రష్యా సహా పది దేశాలున్నాయి. వీటిపై కొంత సమయం తీసుకుని ఆంక్షలు విధిస్తారు.
వైరి పక్ష దేశాలతో సంబంధాలున్నప్పటికీ, హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశాలను ఎల్లో కేటగిరీలో చేర్చారు. వీటిపై దశల వారీగా ఆంక్షలు పెట్టాలని భావిస్తున్నారు. ఇక భారత్ మిత్ర పక్షంలోనే ఉండటం వల్ల.. ఇతరత్రా కారణాలతో తప్ప ఇక్కడి విద్యార్థులకు ఈ తరహా ఇబ్బందులేవీ లేనట్టేనని అంటున్నారు.
అమెరికా స్నేహితులతో జాగ్రత్త
అమెరికా రావాలనుకునే వాళ్ళు ముందుగా సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అక్కౌంట్స్ ఉన్నాయనేది చూసుకోవాలి. అనుమానం ఉన్న వ్యక్తులతో ఎలాంటి సామాజిక సంబంధం ఉన్నా, వీసా విషయంలో ఇబ్బందులు తప్పవు. సాధారణంగా అమెరికాలో ఉండే స్నేహితులను మనవాళ్ళు నమ్ముతారు. అయితే వాళ్ళ నేపథ్యం, వాళ్ళు అమెరికాలో ఎలా ఉంటున్నారనేది కూడా ముఖ్యమే.
– సిరిమళ్ళ వీరేంద్ర (అమెరికాలో ఎంఎస్ చేస్తున్న భారతీయ విద్యార్థి)
తప్పుడు సర్టిఫికెట్లు, పార్ట్టైమ్తోనే ఇబ్బంది
వీసాలు పూర్తిగా ఆపేయలేదు. వ్యక్తిగత వివరాలు, వెళ్ళే వర్సిటీ గురించి వాకబు చేయమని మాత్రమే అమెరికా ఆదేశించింది. భారతీయుల పట్ల అమెరికాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కాకపోతే తప్పుడు ధ్రువపత్రాలతో వెళ్ళాలనుకున్నా, అక్కడికెళ్ళి పార్ట్‌టైం ఉద్యోగం చేస్తామన్నా, ఆ దిశగా లావాదేవీలున్నా వీసాకు ఇబ్బందులెదురవుతాయి.
– జయవర్థన్ ఏకాటి (కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకుడు)