
అమెరికాలో తుపాకీ కాల్పుల్లో మరణించిన రవితేజ, చంద్రశేఖర్ పోలే, మహ్మద్ నిజాముద్దీన్
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం భారత యువత ఎక్కువగా అమెరికా వెళ్తుతున్నారు. అగ్రరాజ్యంలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ స్టూడెంట్సే అధికంగా ఉన్నారు. ఉన్నత చదువులతో పాటు పనిచేసుకునే సౌలభ్యం ఉండడంతో భారత విద్యార్థుల్లో అధికశాతం అమెరికావైపు మొగ్గుచూపుతున్నారు. అయితే అమెరికాలో మన విద్యార్థుల మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
భారత విదేశాంగ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో అమెరికాలో దాదాపు 160 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. 2020, జూన్ నుంచి 2024 జూన్ వరకు 108 మంది భారత విద్యార్థులు (Indian Students) మరణించారు. గతేడాది నుంచి ఇప్పటివరకు మరో 10 మంది వరకు చనిపోయారు. అధికారిక లెక్కల కంటే భారతీయుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ప్రమాదాలు, దొంగతనాలు, తుపాకీ కాల్పుల కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారని వెల్లడించారు.
40 కుటుంబాలకు సహాయం
''అమెరికాలో మనవాళ్లు చనిపోతున్న విషాదకర ఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తున్నాం. యాక్సిడెంట్లు, చోరీలు, తుపాకీ కాల్పుల్లో మనవాళ్లు ఎక్కువగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విహారయాత్రలకు వెళ్లి నీళ్లలో మునిగిపోయి చనిపోతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 40 కుటుంబాలకు సహాయం అందించాం. పార్థీవదేహాలను ఇండియా పంపించడానికి, ఇక్కడ అంత్యక్రియల ఏర్పాట్ల కోసం మా వంతు సాయం చేశామ''ని వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు వంశీరెడ్డి కంచరకుంట్ల 'టైమ్స్ ఆఫ్ ఇండియాకు' తెలిపారు.
జాగ్రత్తలు తప్పనిసరి
కాగా, నేరాలు ఎక్కువగా జరిగే గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా పనిచేస్తుండడం కూడా మన యువతపై దాడులకు మరో కారణమని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు విశ్వేశ్వర్‌రెడ్డి కాల్వల అన్నారు. అయితే దాడులకు గురవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అని ఇమ్మిగ్రేషన్ (Immigration) లాయర్ జనేత ఆర్ కంచర్ల అన్నారు. హైరిస్క్ ఏరియాలు అవైడ్ చేయాలని, లేట్‌నైట్ బయట తిరగకూడదన్నారు. చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయరాదని సూచించారు.
చెడు అలవాట్లతో..
మోతాదుకు మించి మత్తు పదార్థాలు సేవించే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ కార్యదర్శి అశోక్ కోళ్ల ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి కేసులు గత సంవత్సరంలో దాదాపు 30 వరకు తానా (TANA) దృష్టికి వచ్చినట్టు వెల్లడించారు. కాలిఫోర్నియా, టెక్సాస్, కనెక్టికట్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్టు చెప్పారు. ఇక్కడికి వచ్చిన కొద్దిరోజులకే కొంత మంది చెడు అలవాట్లకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.
కాగా, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలలో ఎక్కువగా భారతీయుల మరణాలు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 60 శాతం మంది భారతీయులు (Indians) నివసిస్తున్నారు.
చదవండి: ఎయిర్ బ్యాగ్.. పిల్లాడి ప్రాణం తీసింది!
2025లో కాల్పుల్లో చనిపోయిన తెలుగు విద్యార్థులు
అక్టోబర్ 4, 2025: టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం డల్లాస్ వెళ్లిన చంద్రశేఖర్.. పెట్రోల్ బంకులో దోపిడీని అడ్డుకునే క్రమంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
సెప్టెంబర్ 3, 2025: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) మృతి చెందాడు. కాలిఫోర్నియా శాంటాక్లారా ఏరియాలో రూమ్మేట్‌తో గొడవపడి, కత్తితో అతడిని పొడిచాడు. దీంతో పోలీసులు నిజాముద్దీన్‌పై కాల్పులు జరిపారు.
జనవరి 20, 2025: హైదరాబాద్‌కు చెందిన రవితేజ అనే ఎంబీఏ విద్యార్థి కనెక్టికట్‌లోని న్యూ హెవెన్‌లో దుండగుల కాల్పుల్లో మృతిచెందాడు. సైన్స్‌లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లిన అతడు.. పెట్రోల్ బంకులో దోపిడీని అడ్డుకోవడంతోనే ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి.