
ప్రమాదాలు ఎప్పుడు, ఎలా సంభవిస్తాయో చెప్పలేం. అందుకే ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలంటారు పెద్దోళ్లు. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లల విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం. బైకులు, కార్లలో పిల్లలను ఎక్కించుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తుండడం ఇటీవల కాలంలో పెరిగింది. ఇదిలావుంచితే కారులో తండ్రి ఒడిలో కూర్చున్న బాలుడు ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని ఆలత్తూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కారులో హఠాత్తుగా ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ఆరేళ్ల పిల్లాడు చనిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. కల్పకం (Kalpakkam) సమీపంలోని పుదుపట్టిణం గ్రామానిక చెందిన వీరముత్తు, తన భార్య, కుమారుడు, మరో ఇద్దరితో కలిసి సోమవారం రాత్రి రెంటల్ కారులో చెన్నైకి బయలు దేరారు. విఘ్నేష్(26) అనే డ్రైవర్ కారు నడుపుతున్నాడు. వీరముత్తు తన ఆరేళ్ల కొడుకు కవిన్‌ను ఒళ్లో పెట్టుకుని ముందు సీట్లో కూర్చుకున్నాడు.
తిరుపోరూర్ సమీపంలోని ఆలత్తూర్ (Alathur) పెట్రోల్ బంక్ వద్ద వీరికి కారుకు ప్రమాదం సంభవించింది. ముందెళున్న కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారులోని ఎయిర్‌బ్యాగ్ (airbag) కవిన్ ముఖంపై వేగంగా తెరుచుకోవడంతో అతడు కుప్పకూలిపోయాడు. బాలుడిని వెంటనే తిరుపోరూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పాడు. కుమారుడి ఆకస్మిక మరణంతో వీరముత్తు, అతడి భార్య హతాశులయ్యారు.
ముందు వెళ్లిన కారు ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా సడన్‌గా కుడివైపు తిరగడంతో ప్రమాదం సంభవించిందని పోలీసులు గుర్తించారు. ఇందులో ఉన్న వ్యక్తిని తిరుపోరూర్ సమీపం పయ్యనూర్ గ్రామానికి చెందిన సురేష్ (48)గా గుర్తించారు. అతడు కారులో పయ్యనూర్ నుంచి తిరుపోరూర్ వెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపి బాలుడి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలతో సురేష్‌పై తిరుపోరూర్ (Thiruporur) పోలీసులు కేసు నమోదు చేశారు.
నివేదిక వచ్చాకే..
బాలుడి మృతదేహానికి చెంగల్పట్టు మెడికల్ కాలేజీలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. కవిన్ మరణానికి గల వాస్తవ కారణాలు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. అతడి ఒంటిపై కనిపించే గాయాలేవీ లేవన్నారు. షాక్, అంతర్గత రక్తస్రావం కారణంగా మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
చదవండి: కారుతో ఓవరాక్షన్.. వీడియో వైరల్